9న తిరుచ్చి వేదికగా డీఎంకే మహానాడు
– ద్రావిడ మోడల్ 2.ఓగా నామకరణం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించే విధంగా మార్చి 9న తిరుచ్చి వేదికగా డీఎంకే మహానాడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, మంత్రి కేఎన్ నెహ్రూ దృష్టి పెట్టారు. ప్రతి ఎన్నిలకు ముందుగా డీఎంకే నేతృత్వంలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి పూర్తిగా పార్టీ వర్గాలు ఎన్నికల పనులలోనే నిమగ్నం అవుతారు. ఆ దిశగా ఐదేళ్ల అనంతరం తాజాగా జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, మార్చి 9న తిరుచ్చిలో మహానాడు జరగనుంది. తిరుచ్చి, మదురైలు డీఎంకేకు సెంటిమెంట్ కావడంతో ప్రతిసారీ ఇక్కడే ఎన్నికలు శంఖారావం నిర్వహించడం జరుగుతోంది. ఆ దిశగా ప్రస్తుతం తిరుచ్చిలో మార్చి 9వ తేదిన 10 లక్షల మందితో మహానాడు నిర్వహనకు సన్నద్దమయ్యారు. ద్రావిడ మోడల్ 2.ఓ పేరిట ఈ మాహానాడు నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏర్పాట్లను మంత్రి కేఎన్ నెహ్రు పర్యవేక్షిస్తున్నారు. కాగా, మహానాడు లోపు సీట్ల పందేరం ముగించే దిశగా డీఎంకే నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ కోశాధికారి టీఆర్‌బాలు నేతృత్వంలోని కమిటీ మిత్ర పక్షాలతో చర్చలలో నిమగ్నమైన విషయం తెలిసిందే. శుక్రవారం వామపక్షాలతో సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో నల్లకన్ను మరణంతో అది కాస్తవాయిదా పడింది. దీంతో శుక్రవారం కాంగ్రెస్‌తో సీట్ల పందేరం చర్చను కొలిక్కి తెచ్చే దిశగా టీఆర్‌బాలు కమిటీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కమిటీ గురువారం చైన్నెకు చేరుకుంది. ఈ పందేరంలో కాంగ్రెస్ లేదా డీఎంకే మెట్ట దిగేనా, లేదా పట్టు వీడకుండా ఉండేనా అన్నది వేచి చూడాల్సిందే. సీట్ల పందేరంలో వివాదం బయలు దేరి న పక్షంలోప్రత్యామ్నయంగా విజయ్ టీవీకే వైపుగా కాంగ్రెస్ చూపులు ఉన్నట్టు చర్చ ఊపందుకుంది.


