ప్రతిభను ప్రోత్సహించేందుకే..
తమిళసినిమా: సినిమా నూతన కళాకారుల చేతిలో కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లఘు చిత్రాలతో కొత్త దర్శకులు తమ ప్రతిభను ప్రపంచ సినిమాకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నూతన దర్శకుడు నవీన్. దర్శకుడు రాజు మురుగన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈయన ఇప్పుడు లిటిల్ వింగ్స్ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించి పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలు పొందడంతోపాటు అవార్డులను గెలుచుకున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను వ్యూఫైండర్ సంస్థ, దర్శకుడు రాజుమురుగన్‌కు చెందిన కామ్రేడ్ టాకీస్ సంస్థ కలిసి నిర్మించాయి. మణిమేఘల, రంగస్థల నటుడు నిదర్శన సి.కాళిదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ షార్ట్ ఫిలింను చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ అధినేతలు ఎస్సార్ ప్రకాష్, ఎస్సార్ ప్రభు తమ డ్రీమ్ వారియర్ యూట్యూబ్ చానల్ ద్వారా ఈ నెల 27న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ షార్ట్ ఫిలిం అంతర్జాతీయ దినోత్సవాల్లో అవార్డులు లభించడం సంతోషంగా ఉందన్నారు. నవీన్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ఇక్కడి వరకు రావడం సంతోషమన్నారు. దీనికి కారణం డ్రీమ్ వారియర్స్ సంస్థ భాగం కావడమేనని పేర్కొన్నారు. దర్శకుడు నవీన్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ తాను ప్రకాష్ కలసి ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి కోడిపందేలు చూసిన జ్ఞాపకం ఇప్పటికీ ఉందన్నారు. ఆదాయాన్ని పక్కనపెట్టి కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే తమ డ్రీమ్ వారియర్ సంస్థ మ్యూజిక్ ఆల్బమ్‌లను విడుదల చేస్తుందని, అదేవిధంగా ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కూడా విడుదల చేయడానికి సిద్ధమైందని ఆయన చెప్పారు.


