నేడు సీఈసీ రాక
సాక్షి, చైన్నె : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బుధవారం చైన్నెకు రానున్నారు. తొలి రోజు పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. ఎన్నికల కమిషనర్ బృందం రంగంలోకి దిగనున్న నేపథ్యంలో సీఎస్ మురుగానందం సచివాలయంలో మంగళవారం అధికారులతో భేటీ అయ్యారు. అదే సమయంలో కలెక్టర్ల బదిలీల ప్రక్రియపై దృష్టి పెట్టారు. వివరాలు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలో ఇద్దరు ప్రత్యేక ఐఏఎస్‌లతో కూడిన బృందం వేగవంతం చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్లు భాను ప్రకాష్, మనీష్ గార్గ్, పవన్‌కుమార్ శర్మ, సంజయ్‌కుమార్, అశీష్ గోయల్ తదితర ఏడు మంది సభ్యులతో కూడిన బృందం చైన్నెలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలను విజయవంతం చేయడం లక్ష్యంగా, నగదు బట్వాడా కట్టడి దిశగా భద్రత ఏర్పాట్లు, తనిఖీలు , సమష్టి సమన్వయం వంటి అంశాల గురించి ఎన్నికల డిప్యూటీ కమిషనర్లు ఇక్కడి అధికారులతో చర్చించి నివేదికను కేంద్ర ఎన్నికల ప్రదాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు సమర్పించారు. దీనిని పరిశీలించిన అనంరతం తుది కసరత్తులను ముగించి, ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సిద్ధమయ్యారు. ఇందు కోసం చైన్నెకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చైన్నెకు జ్ఞానేశ్‌కుమార్‌తో పాటుగా ఏడుగురు అధికారులతో కూడిన బృందం రానున్నది. వీరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ బృందం ఆహ్వానం పలకనుంది. ఇక్కడి నుంచి పుదుచ్చేరికి వెళ్లనున్నారు. ఇక్కడ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి చైన్నెకు 26వ తేది చేరుకుంటారు. ఎంఆర్‌సీ నగర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో సమావేశాలు జరుగుతాయి. తొలుత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తదుపరి 27వత ఏదీన రాజకీయ పక్షాల నేతలు, సీఎస్, డీజీపీ వంటి ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం జరగనుంది.
సీఎస్ భేటీ : ఎన్నికల కమిషన్‌తో సమావేశం నేపథ్యంలో ప్రభుత్వ అధికారులతో సచివాలయంలో సీఎస్ మురుగానందం సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం తరపున చేయాల్సిన వివిధ పనులకు సంబందించిన నివేదికను సిద్ధం చేశారు. అధికార యంత్రాంగం సహకారం గురించి సమీక్షించడమే కాకుండా శాఖ పరంగా ఆయా విభాగాలు సంబంధిత పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు.
బదిలీలు..
స్పెషల్ ఇనిషియేటివ్స్ విభాగం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక, గణాంకాల విభాగం కమిషనర్‌గా ఉన్న ఆర్. జయను నియమిస్తూ సీఎస్ మురుగానందం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చిన ప్రత్యేక కార్యక్రమాల శాఖ కార్యదర్శి కె. గోపాల్ పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. కాంచీపురం జిల్లా కలెక్టర్ కలై సెల్వి మోహన్ ఆర్థిక, గణాంకాల విభాగం క మిషనర్‌గా నియమించారు. చెంగల్పట్టు కలెక్టర్‌గా ఉన్న స్నేహను కాంచీపురానికి బదిలీ చేశారు. చెంగల్పట్టు డిప్యూటీ కలెక్టర్ మాలతి హెలెన్‌ను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. మరో డిప్యూటీ కలెక్టర్ జి. రవికుమార్‌ను కరూర్ కలెక్టర్‌గా పంపించారు.
నేడు సీఈసీ రాక


