చైన్నె–తిరువణ్ణామలై మధ్య ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి తిరువణ్ణామలైకు ఆరులైన్లతో ఎక్స్‌ప్రెస్ వే రూపకల్పనకు రహదారుల శాఖ సన్నద్ధమైంది. ఈ మార్గంలో రెండు గంటలలో తిరువణ్ణామలై చేరుకునే వీలుంది. చైన్నె – తిరువణ్ణామలై మద్య 140 కి.మీ దూరం ఉంది. చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలో దిండివనం మీదుగా ఓ మార్గంలో, కాంచీపురం నుంచి సెయ్యారుమీదుగా గ్రామాలను కలుపుతూ మరో మార్గంలో, చైన్నె నుంచి శ్రీపెరంబదూరు , కాంచీపురం మీదుగా వేలూరు నుంచి ఇంకో మార్గంలో తిరువణ్ణామలైకు వెళ్లేందుకు వీలుంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర రహదారుల శాఖ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ కొత్త ప్రాజెక్ట్ రవాణా, పరిశ్రమలు, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న చైన్నె రింగ్ రోడ్డులోని ఒరగడం సమీపంలో ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే సెయ్యర్, పారిశ్రామిక ప్రాంతాలను కలిపే మార్గంగా తిరువణ్ణామలైకి చేరుకునే విధంగా రాష్ట్ర రహదారుల శాఖ కసరత్తులు చేపట్టింది.
పర్యాటక, పరిశ్రమలకు ఊతం
ఈ మార్గంతో ఎన్నూరు, కాట్టుపల్లి హార్బర్‌ల నుంచి సరుకు రవాణా వేగవంతం కానుంది. కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాల్లోని పరిశ్రమలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, సరుకు రవాణా, సమయం గణనీయంగా ఆదా కానుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అరుణాచలేశ్వరుడి దర్శనార్థం సంవత్సరానికి లక్షలాది భక్తులు తిరువణ్ణామలైను సందర్శిస్తారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారి, పర్యాటక అభివృద్ధికి దోహదం చేయనుంది.
రెండు దశల్లో నిర్మాణం
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాజెక్ట్‌ను రెండు దశలుగా విభజించారు. తొలి దశలో సుమారు 8 కి.మీ. పరిధిలో భూసేకరణ పనులు తుదిదశలో ఉన్నాయి. భూసేకరణ పూర్తయిన వెంటనే 2–3 నెలల్లో టెండర్లు ఆహ్వానించనున్నట్లు సమాచారం. రెండో దశలో మిగిలిన మార్గ నిర్మాణం చేపడతారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే చైన్నె–తిరువణ్ణామలై మధ్య రవాణా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఉన్న 4 గంటల ప్రయాణం 2 గంటలకు తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.


