ఘనంగా మాతృభాషా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మాతృభాషా దినోత్సవం

Feb 22 2026 7:19 AM | Updated on Feb 22 2026 7:19 AM

ఘనంగా మాతృభాషా దినోత్సవం

ఘనంగా మాతృభాషా దినోత్సవం

కొరుక్కుపేట: జనని సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.దీనికి చైన్నె మైలాపూర్‌లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనం వేదికై ంది. జనని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ నిర్మల పళనివేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలుగు భాషాభిమానులు పాల్గొని మాతృభాషపై వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ముందుగా సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ నిర్మల పళనివేలు అధ్యక్షోపన్యాసం చేస్తూ యునెస్కో వారు ప్రకటించిన విధంగా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జనని సంస్థ ఘనంగా జరుపుకోవడం గర్వకారణమైన విషయంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి అయిన ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని, అవి రెండూ కూడా తెలుగు భాషా దినోత్సవాలేనని పేర్కొన్నారు. మన జాతి సంస్కృతికి, నాగరికత వికాసానికి పట్టుకొమ్మవంటిది భాష అని, భాషా నైపుణ్యం దేశ ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం వక్తలుగా పాల్గొన్న వారిలో రాజధాని కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్‌ ఎలిజిబెత్‌ జయకుమారి మాట్లాడుతూ దేశభాషల్లో తెలుగు లెస్స అని కీర్తించిన శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు కవులను గుర్తు చేస్తూ భాష గొప్పతనాన్ని చాటారు. అనంతరం రచయిత్రి క్రొవ్విడి రమాదేవి మాట్లాడుతూ అన్ని భాషల్లోకెల్లా తెలుగు మధురమైన భాష అని వ్యాఖ్యానిస్తూ మన తెలుగు భాషను కాపాడుకోవాలని కవిత రూపంలో వినిపించి ఆకట్టుకున్నారు . అలాగే రచయిత్రి ఆముక్తమాల్యద మాట్లాడుతూ ప్రస్తుత యుగంలో ఏఐ గురించి, అందులో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి మాట్లాడి ఆలోచింపజేశారు. అలాగే జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొని పెరంబూరు తెలుగు సాహితీ సమితి కార్యదర్శి టీఆర్‌ఎస్‌ శర్మ రాసిన అభినందన లేఖను చదివి వినిపించారు. తెలుగు భాషాభిమానులు వంజరపు శివయ్య, డాక్టర్‌ విస్తాలి శంకరరావు, డాక్టర్‌ కొల్లి రాజు తదితరులు తెలుగు భాష గొప్పతనంపై మాట్లాడారు. స్వాగతోపన్యాసాన్ని గాయని అరుణాశ్రీనాథ్‌ చేయగా, ప్రార్థనా గీతాన్ని నెల్లుట్ల లీల, వందన సమర్పణను ఎస్‌.ఝాన్సీ చేశారు. తెలుగు భాషాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement