క్లుప్తంగా
లగేజీ వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం
తిరువొత్తియూరు: బైక్‌ను లగేజీ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. మదురై జిల్లా ఉసిలంపట్టి తాలూకా కరుమాత్తూరు ప్రాంతానికి చెందిన రాజగురు (27). శనివారం రాత్రి ఇతను, అన్న కూతురు ప్రమిల్లాశ్రీ (7), పక్కింటికి చెందిన సంగీత (29)తో వైద్యం కోసం బైక్‌లో ఆస్పత్రికి వెళ్తున్నారు. మదురై మెయిన్ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో అతివేగంగా వచ్చిన లగేజీ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో రాజగురు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రమిల్లాశ్రీ, సంగీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నూరుణి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి రాజ్‌గురు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కురవకుడికి చెందిన పాండి (43)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త బలవన్మరణం
అన్నానగర్: భార్య మందలించిందని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెంగల్పట్టు జిల్లాలోని మరైమలై నగర్ కీళకరణై ప్రాంతానికి చెందిన కన్నన్, అదే ప్రాంతంలో సొంత వెల్డింగ్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇతను జాస్మిన్‌ను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కన్నన్ ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. విరక్తి చెందిన జాస్మిన్ భర్తను తీవ్రంగా మందలించి పిల్లలను తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన కన్నన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి ఇరుగుపొరుగు వెంటనే మరైమలైనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరైమలై నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు డ్రైవర్ ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె పోరూర్ చెరువులో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మరణించిన వ్యక్తి చైన్నె, టి. నగర్ ప్రాంతానికి చెందిన చంద్రన్ (52) అని తెలిసింది. ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న చంద్రన్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన చంద్రన్ పోరూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
బస్సు బోల్తా పడి మహిళ మృతి
తిరువొత్తియూరు: ప్రైవేట్ ఆమ్మి బస్సు బోల్తా పడి చైన్నెకి చెందిన మహిళ మృతి చెందింది. మరో 39 మందికి గాయాలయ్యాయి. చైన్నె నుంచి రామనాఽథపురం జిల్లా ముదుకులత్తూరుకు ప్రైవేట్ ఆమ్మి బస్సు శనివారం 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిలోని కడలూరు జిల్లా వేపూర్ ప్రాంతం వద్ద వెళుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న బారికేడ్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చైన్నె–తాంబరానికి చెందిన విజయన్ భార్య రేణుక (50) సంఘటన స్థలంలోనే మృతిచెందింది. 39మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిని వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నయన మనోహరం
– ఆద్యా వినయ్ భరతనాట్య అరంగేట్రం
కొరుక్కుపేట: చైన్నె చేట్‌పేటలో నివసిస్తున్న తెలుగు కుటుంబం ఆశ, వినయ్ దంపతుల కుమార్తె ఆద్యా వినయ్ భరతనాట్య అరంగేట్రం నయన మనోహరంగా సాగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి దీనికి చైన్నె మైలాపూర్‌లోని ఆర్‌ఆర్ సభ వేదికైంది. నర్తకి ఆద్యా వినయ్ తనదైన హావభావాలతో, ముద్రాలతో అత్యంత అనురక్తితో నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ కె ఎస్ రామస్వామి, గురువు శృతి శోబై, తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అలింగం రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి ఆద్యా వినయ్‌ను శాలువాతో సత్కరించి నాట్య మయూరి అవార్డును అల్లింగం రాజశేఖర్ అందజేశారు. ఆద్యా వినయ్ నృత్యానికి నట్టువాంగం పై గురువు శృతిశోబై, గాత్రం పై గిరీష్ మీనన్, మృదంగం పై నగరాజన్ షణ్ముగలింగం, వయోలిన్ పై సుకన్య, ప్లూట్‌పైమోహన్ సహకారం అందించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


