కదం తొక్కిన.. కార్మిక లోకం
సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు రాష్ట్రంలో హోరెత్తాయి. కార్మిక సంఘాల నేతృత్వంలో రైల్ రోకోలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. చైన్నెలో పలుచోట్ల ఆందోళనలు జరగగా సుమారు ఎనిమిది వేల మంది కార్మికులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో పాటుగా అనుబంధ కార్మిక విభాగాలు కేంద్ర కార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా, వివిధ డిమాండ్లను ఎత్తి చూపుతు ఒక రోజు సార్వత్రిక సమ్మెకు గురువారం పిలుపు నిచ్చాయి. దీనికి డీఎంకే కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే, ఉద్యోగులు నిరసనలలో భాగస్వామ్యం అయ్యే విధంగా విధులు బహిష్కరిస్తే, చర్యలు తప్పదని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది.
కేంద్రం తీరును ఎండగడుతూ..
కేంద్ర ప్రభుత్వం తమిళనాడును అభివృద్ధిని విస్మరించిందన్న ఆగ్రహంతో, విద్యా నిధులు, నీటి సరఫరా పథకాలు, రైల్వే అభివృద్ధికి ఏదీ నిధులు అని ప్రశ్నిస్తూ కార్మిక చట్ట సవరణ బిల్లులు కార్మిక హక్కులను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉదయాన్నే నిరసనలు హోరెత్తాయి. కార్మికులు, రైతులు, ఆయా పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు నిరసనలో భాగస్వామ్యమయ్యాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఏఐయూటీయూసీ, డియూసీసీ, తదితర సంఘాలు, రైతు సంఘాలు, సమాఖ్యాల నేతృత్వంలో మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, తదితర నగరాలలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద నిరసనలు హోరెత్తించారు. డెల్లా జిల్లాలలో రైతు సంఘాలు కదం తొక్కడంతో పలు చోట్ల రైల్‌రోకోలు జరగ్గా నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పలు రైళ్లను నిరసన కారులు అడ్డుకోవడంతో వాటి సేవలకు ఆటంకం తప్పలేదు. ఇక చైన్నెలోని తిరువొతి్‌ూత్యర్, అంబత్తూర్, అన్నా సాలై హెడ్ పోస్టాఫీస్, గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పల్లావరం తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిరసనలో పాల్గొన్న పలువురిని అదుపులోకి తీసుకుని సమీపంలోని కల్యాణ మండపాలకు తరలించారు. ధర్నాల కారణంగా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోస్టల్, ఆదాయపు పన్ను కార్యాలయాల పనితీరు కొంత మేర ప్రభావితమైంది. రోడ్డు దిగ్బంధనలు, రైలు మార్గ నిరసనల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. విమ్కో నగర్ వద్ద ఎలక్ట్రిక్ రైలును నిరసన కారులు అడ్డుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతృత్వంలో సాయంత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో వివక్షను ఖండిస్తూ నిరసనలు అనేక చోట్ల జరిగాయి. కాగా రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె నిరసనలకే పరిమితమయ్యాయి. అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ లేదు. నిరసనలు జరిగిన ప్రాంతాలలో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.
కదం తొక్కిన.. కార్మిక లోకం
కదం తొక్కిన.. కార్మిక లోకం


