రంగంలోకి బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

రంగంలోకి బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ

రంగంలోకి బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ

● బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిపై భయాందోళనలు ● రాందాసు ఆవేదన

సాక్షి, చైన్నె: బీజేపీలో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు నిర్వహణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ జాబితాను ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ కమిటీలను ఇప్పటికే బీజేపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు నాయకులు, స్వచ్ఛంద సేవకులు పూర్తిగా క్షేత్రస్థాయి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్‌ నేత పొన్‌ రాధాకృష్ణన్‌, రాష్ట్ర కోశాధికారి ఎస్‌ఆర్‌ శేఖర్‌, ఉపాధ్యక్షుడు ఆర్‌ఎన్‌ జయప్రకాష్‌, వెంకటేశన్‌, రాష్ట్ర స్థాయి నేతలు మాలా సెల్వకుమార్‌, ఎస్‌ఆర్‌ రామ ప్రియన్‌ ఉన్నారు.

21న కొచ్చిలో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక

సాక్షి, చైన్నె: దక్షిణ భారత సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభకు సత్కారంగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ఉత్సవం ఈసారి కేరళ రాష్ట్రం కొచ్చిలో జరగనుంది. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను తొలిసారిగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21 కొచ్చిలోని అడ్లక్స్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ మహోత్సవం జరగనుంది. కేరళ ప్రభుత్వ ప్రజాపనులు – పర్యాటక శాఖ మంత్రి పి.ఎ. మహ్మద్‌ రియాస్‌, డబ్ల్యూడబ్ల్యూఎం అండ్‌ టైమ్స్‌ స్ట్రాటజిక్‌ సొల్యూషన్‌ డైరెక్టర్‌ రోహిత్‌ గోపకుమార్‌, ఫిల్మ్‌ ఫేర్‌ ఎడిటర్‌ జితేష్‌ పిళ్‌లైలో గురువారం ఈ వివరాలను స్థానికంగా ప్రకటించారు. దక్షిణ భారత సినిమా అత్యుత్తమ ప్రతిభను గౌరవించే ఈ వేడుకను కేరళలో నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని ఫిల్మ్‌ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఇది కీలక అడుగు అవుతుందని చెప్పారు. దక్షిణ భారత సినిమా వైభవం, వైవిధ్యం, సృజనాత్మకతను మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనున్న ఈ అవార్డు వేడుకపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొందన్నారు. ఈ అవార్డుల ఉత్సవానికి తమిళం,తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలు నామినేషన్లలో ఉన్నాయని, అలాగే, ఉత్తమ నటీ నటులు, దర్శకులు, తదితర అన్ని రకాల అవార్డుల నామినేషన్లు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.

భారీగా కాకుల మరణాలు

తిరువొత్తియూరు: చైన్నె ,తిరువొత్తియూరు ఎర్నావూరు ప్రాంతంలో పెద్దఎత్తున కాకులు చనిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కాకులు అకస్మాత్తుగా చనిపోతున్నాయి. బర్డ్‌ ఫ్లూ కారణంగా కాకులు చనిపోతున్నాయని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో చనిపోయిన కాకులను లోతైన గుంతలు తవ్వి పూడ్చిపెట్టాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో చైన్నె ఎర్నావూరు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కాకులు అంతుపట్టని రీతిలో మృతి చెంది పడి ఉన్నాయి. ఇది చూసిన ప్రజలు బర్డ్‌ ఫ్లూ వ్యాపించిందని భయపడి చైన్నె కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చైన్నె కార్పొరేషన్‌ వైద్య అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన కాకులను గుంత తవ్వి పాతి పెట్టారు. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

రాజకీయాల నుంచి తప్పించేందుకు కుట్ర

సాక్షి, చైన్నె: తనను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆవేదన వ్యక్తం చేశారు. రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ ద్వారా పార్టీని తన గుప్పెట్లోకి అన్బుమణి తీసుకుని, బీజేపీ, అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేశారు. అదే సమయంలో రాందాసు వెన్నంటి ఉన్న వారిని టార్గెట్‌ చేస్తూ అన్బుమణి విరుచుకు పడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం దిండివనంలో రాందాసు మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి తరపున తనకు వ్యతిరేకంగా అబద్ధాలు, వక్రీకరణతో కూడిన వ్యాఖ్యలు పెరిగాయని వివరించారు. రోజుకో అబద్ధాలను వళ్లిస్తున్నారని, రాజకీయంగా తనను దిగజార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలు చూస్తుంటే, తనను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగేలా చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అపవాదులను మూట కట్టడం తీవ్ర బాధ కలిగిస్తోందని, తనను ఎగతాళి చేయడం, మరింత వేదనకు గురిచేస్తున్నట్టు ఉద్వేగానికి లోనయ్యారు. తనను మాత్రమే కాకుండా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ అధ్యక్షుడు జీకేమణిని సైతం నీచంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ, చిహ్నం విషయంగా తాను హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్నికల కమిషన్‌ సరైన మార్గంలో వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement