ఎవరికీ తల వంచం! | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ తల వంచం!

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

ఎవరిక

ఎవరికీ తల వంచం!

● ప్రజా మద్దతుతో మళ్లీ అధికారం ● మీతో స్టాలిన్‌ 10 వేల శిబిరంలో సీఎం స్టాలిన్‌ ధీమా

తమిళనాడును తలదించుకోనివ్వం, తాము ఎవ్వరికీ తల వంచం అని సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ప్రజల మీద అపార నమ్మకం ఉందని, వారి మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నా కల..నా భవిష్యత్తు వెబ్‌సైట్‌ను దిండివనం వేదికగా బుధవారం స్టాలిన్‌ ఆవిష్కరించారు. మీతో స్టాలిన్‌ 10 వేల ఫిర్యాదుల స్వీకరణ శిబిరంలో ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

సాక్షి,చైన్నె: విల్లుపురం జిల్లా దిండివనం వేదికగా ఉదయం ‘‘స్టాలిన్‌ విత్‌ యూ’’ ప్రాజెక్ట్‌ కింద నిర్వహించిన పదివేలవ శిబిరాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా 1,82,967 మంది లబ్ధిదారులకు వృద్ధాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌, వితంతు పెన్షన్‌ తదితర సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను అందజేశారు. ఈ పెన్షన్‌ల కోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.260 కోట్లను అందజేస్తోంది. ప్రజల వద్దకే అన్ని రకాల రకాల ప్రభుత్వ సేవలను దరిచేర్చే విధంగా స్టాలిన్‌ విత్‌ యూ కార్యక్రమానికి రాష్ట్రంలో విశేష స్పందన వస్తున్నది. ఈ శిబిరాల ద్వారా ఇప్పటి వరకు 38.50 లక్షల విజ్ఞప్తులను స్వీకరించి 38.44 లక్షల ఫిర్యాదులను పరిష్కరించారు.

నా కల.. నా భవిష్యత్తు వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

యువత కలలను తెలుసుకుని, వారి భవిష్యత్తుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నా కల – నా భవిష్యత్తు అనే కొత్త వెబ్‌సైట్‌ను దిండివనం వేదికగా ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యువత తమ ఆశయాలు, కలలను నమోదు చేసుకునేందుకు ఎన్‌కనవు.టీఎన్‌.జీవోవీ వెబ్‌సైట్‌ ద్వారా అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, విల్లుపురం జిల్లాలో రూ.390.44 కోట్లతో పూర్తైన 199 అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు.అలాగే,రూ.254.29 కోట్లతో చేపట్టనున్న 24 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.43.75 కోట్ల విలువైన ప్రభుత్వ సంక్షేమ సహాయక పథకాలను 13,879 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే, ఆయా ప్రాంతాలలో జరిగిన శిబిరాలలో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రజల విజ్ఞప్తులను సీఎం స్టాలిన్‌ పరిశీలించారు. అంతకు ముందు దిండివనంలో సీఎం రోడ్‌ షో జరిగింది. ఈ సందర్భంగా నడచుకుంటూ జనాన్ని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ సీఎం ముందుకు సాగారు.

ప్రజలే అండగా ఉంటారు..

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, తాజాగా మీతో స్టాలిన్‌ పేరిట 10 వేల శిబిరాలను పూర్తి చేశామన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించడమే ఈ పథకం ప్రధాన కర్తవ్యం అని వివరించారు.ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ పనిచేయాలని, చిన్న అవసరాల కోసం కూడా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా పొందేందుకు వీలు కల్పించామన్నారు. ‘స్టాలిన్‌ విత్‌ యు’ శిబిరాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 38.5 లక్షల దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో 38.44 లక్షల పిటిషన్లకు ఇప్పటికే పరిష్కారం అందించారు. ఈ శిబిరాల ద్వారా 15 శాఖలకు చెందిన 46 రకాల సేవలు ప్రజలకు అందించబడినట్లు సీఎం వివరించారు. సామాజిక భద్రతా పెన్షన్లు, పట్టా మార్పులు, ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా, కుటుంబ కార్డు సవరణలు, రెవెన్యూ ధృవపత్రాలు, ఆస్తి పన్ను పేరు మార్పు వంటి సేవలు 30 నుంచి 45 రోజుల్లోపు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసం,నమ్మకాన్ని చురగొన్నామని పేర్కొంటూ, రానున్న ఎన్నికలలో ప్రజలే తనకుఅ ండగా ఉంటారన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

డిజిటల్‌ పాలన దిశగా అడుగులు

ప్రజల సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక నంబర్‌కు సందేశం పంపడం ద్వారా 16 శాఖలకు చెందిన 51 సేవలు మొబైల్‌లోనే పొందవచ్చని చెప్పారు. తమిళనాడు భవిష్యత్తు రూపకల్పనలో యువత ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ‘టెల్‌ మీ యువర్‌ డ్రీమ్‌’, ‘మై డ్రీమ్‌ – మై ఫ్యూచర్‌’ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడుకు తగిన నిధులు కేటాయించలేదని సీఎం స్టాలిన్‌ విమర్శించారు.

ఎవరికీ తల వంచం!1
1/1

ఎవరికీ తల వంచం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement