ఆలి కొండన్ నవల ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : తమిళ గడ్డను ఏలిన రాజ రాజ చోళుడు పొన్నియిన్ సెల్వన్‌కు కొనసాగింపుగా రాజేంద్ర చోళుని విజయాల కథనంగా 16 ఏళ్ల యువ రచయిత తొలి ప్రయత్నంగా ఆలి కొండన్ పేరిట నవలను సిద్ధం చేశారు. పొన్నియిన్ సెల్వన్ నవలకు కొనసాగింపుగా భావించబడుతున్న చారిత్రక కల్పిత నవల శ్రీఆలికొండన్ – ది కాంకరర్ ఆఫ్ ఓషన్స్ (పార్ట్–1)శ్రీ పుస్తకావిష్కరణ కార్యక్రమం చైన్నెలోని అన్నా విశ్వవిద్యాలయం, తమిళ్ వర్చువల్ అకాడమీలో ఘనంగా జరిగింది. ఈ నవలను కేవలం 16 ఏళ్ల యువ రచయిత రౌనాక్ శివ్ రచించారు. ఆయన శ్రీఅంధువన్‌శ్రీ అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. ఈ పుస్తకం దివంగత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవలకు స్ఫూర్తిగా, చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుని విదేశీ దండయాత్రలు, శాసన ఆధారాలు, చారిత్రక విషయాల సమ్మేళనంగా రూపొందించబడింది. బెంగళూరుకు చెందిన 11వ తరగతి విద్యార్థి అయిన రౌనాక్ శివ్, తన అమ్మమ్మ చెప్పిన కథలు , కల్కి రచనల ద్వారా చోళ చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. విస్తృతమైన పరిశోధన అనంతరం ఈ తొలి నవలను రచించి, దాన్ని దివంగత కల్కి కృష్ణమూర్తికి అంకితం చేశారు. క్రికెటర్ కూడా అయిన రౌనాక్, చోళ సామ్రాజ్య వైభవాన్ని నేటి తరం పాఠకులకు కొత్త కోణంలో పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ రచన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలోపుస్తకం తొలి ప్రతిని ప్రొఫెసర్ డాక్టర్ జి. దేవనాయగం ఆవిష్కరించగా, ప్రముఖ రచయిత కాలచక్రం నరసింహ అందుకున్నారు. ఈ–బుక్ ఎడిషన్‌ను ప్రముఖ రచయిత పట్టుకోట్టై ప్రభాకర్ ప్రారంభించగా, ఆడియో బుక్ ఎడిషన్‌ను మద్రాస్ టాకీస్ దర్శకుడు శివ ఆనంద్ విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ కె.వి.ఎస్. మరుత్తు మోహన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ పుస్తకాన్ని భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పబ్లిషింగ్ సంస్థ అయిన పుస్తక డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది. యువ రచయితలను ప్రోత్సహించాలనే లక్ష్యంలో భాగంగా ‘ఆలికొండన్’ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సాహిత్య ప్రేమికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.


