కమల్, రజనీ కాంబో షురూ?
తమిళ సినిమా: కోలీవుడ్ మూలస్తంభాలైన కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి సంబంధించిన ప్రచారం. వీరిద్దరూ కలిసి ఆరంభ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. అవన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఆ తరువాత ఇద్దరూ స్టార్స్‌గా ఎదగడంతో ఇకపై కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారు. అలా సుమారు 34 ఏళ్ల పాటు సూపర్ స్టార్స్‌గా రాణిస్తున్నారు. మధ్యలో వీరిద్దరిని కలిపి చిత్రం చేయాలని పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది ఇటీవల తన చిరకాల మిత్రుడు రజనీకాంత్‌తో కలిసి చిత్రం చేస్తానని ఆ భారీ, క్రేజీ చిత్రాన్ని తానే తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తానని కమలహాసన్ ప్రకటించారు. దీంతో ఈ వార్త ట్రెండింగ్‌గా మారింది. కమలహాసన్ హీరోగా విక్రమ్ రజినీ కాంత్ హీరోగా కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం ఈ క్రేజీ చిత్రం రూపొందనుందనే ప్రచారం జోరు గానే సాగింది.అంతే కాదు. ఆ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథను కూడా సిద్ధం చేశారు. దాన్ని ఇద్దరు హీరోలకు వినిపించినట్లు, అయితే కథ ఫుల్ మాస్‌గా ఉందని, తమకు లైట్ హార్టెడ్ కథా చిత్రం చేయాలని ఉందని వారు చెప్పినట్లు లోకేష్ కనకరాజ్ ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చిత్రం కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. నెల్సన్ ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా జైలర్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం జైలర్– 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తదుపరి ఈయన దర్శకత్వం వహించేది కమల్, రజినీలో చిత్రమే అవుతుందని సమాచారం.


