పాదయాత్రలో విషాదం
సాక్షి, చైన్నె: సమయపురం మారియమ్మన్ దర్శనార్థం పాదయాత్రగా వెళ్తున్న భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. తైపూసం ఉత్సవాల సందర్భంగా తిరుచ్చి జిల్లాలోని సమయపురం మారియమ్మన్ ఆలయానికి పాదయాత్రకు కడలూరు పరిసరాల నుంచి భక్తుల బృందం బయలు దేరి వెళ్లారు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిౖలోని పెరంబలూర్ జిల్లా సిరువాచురై ప్రాంతంలో వద్ద భక్తుల పాదయాత్రపైకి కారు దూసుకెళ్లింది. చైన్నె నుండి తిరుచ్చికి వెళ్తున్న కారు భక్తులను ఢీ కొంది. ఈ ఘటనలో ఆపరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత , విషాదం చోటు చేసుకుంది. ఈఘటనలో కడలూరు జిల్లా టికాడు గ్రామానికి చెందిన మలర్కోడి (35), విజయ లక్ష్మి(40), చిత్ర (40), శశికళ (47) సంఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్ గౌతమ్(24)తో పాటూ మరికొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పెరంబలూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంమార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు విచారణ నిర్వహించారు. కాగా, ఆదివారం తైపూసం కారణంగా భక్తులు పెద్దఎత్తున మురుగన్ ఆలయాలకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుంది. ఈ దృష్ట్యా, ఆయా ఆలయాలకు వెళ్లే మార్గాలలో భక్తులకు భద్రత కల్పన దిశగా ఆయా జిల్లాల యంత్రాంగాలు చర్యలు చేపట్టాయి.


