రంగంలోకి వేణుగోపాల్
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని టీఎన్‌సీసీ నేతలు తలా ఓ దారిలో చేస్తున్న మాటలను గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ సన్నద్ధమయ్యారు. ఆయన్ను ఏఐసీసీ రంగంలోకి దించడంతో సీఎం స్టాలిన్‌తో భేటీకి కసరత్తు చేపట్టారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్‌సీసీకి చెందిన మరికొందరు నేతలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిక్కులు బయలు దేరినట్లయ్యింది. టీవీకే అధినేత విజయ్‌కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండటాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళిని రంగంలోకి దించారు. ఆమె బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధితో గంటన్నర పాటుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తదుపరి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న సమాచారం వెలువడింది. అదే సమయంలో అధికారంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చి చెప్పడంతో పాటుగా 30 లోపు సీట్లను , ఒక రాజ్య సభ సీటును ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇక్కడ వ్యతిరేక గళం వినిపిస్తున్న టీఎన్‌సీసీ నేతలు అయితే, మళ్లీ విజయ్‌తో పయనం అంటూ స్వరాన్ని పెంచడం చర్చకు దారి తీసింది. విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు ఆహ్వానం పలుకుతూ చేసిన వ్యాఖ్యలను తిరుచ్చి వేలుస్వామి వంటి నేతలు సమర్థించడం, డీఎంకే సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలంటూ హల్ చల్ చేస్తూ పోస్టర్లు తెర మీదకు రావడం డీఎంకేలో మరింత ఆగ్రహాన్ని రేపినట్టైంది. దీంతో కాంగ్రెస్ నేతలను గాడిలో పెట్టడమే కాకుండా, సీఎం స్టాలిన్‌తో చర్చించి సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను ఏఐసీసీ పెద్దలు గురువారం రంగంలోకి దించారు. ఆయన శుక్రవారం చైన్నెకు చేరుకుని , ఇక్కడి నేతలతో సమావేశం కానున్నారు. ఆ తదుపరి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో సమావేశానికి కసరత్తులలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.


