డీఎంకే ప్రభుత్వంలోనే ఆరోగ్యశాఖకు ప్రత్యేక నిధులు
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే ఆరోగ్యశాఖకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తంలో రూ. 44 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి భవణాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంత్రులు సుబ్రమణియన్, ఏవా వేలు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గుడియాత్తంలో మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌తో పాటూ పలువురు మేధావులు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలం ఉన్నాయని అయితే ఇక్కడ ప్రభుత్వాసుత్రి పూర్తిగా పాత కట్టడాలతో నడుస్తుండడంతో గత 2023వ సంవత్సరంలో నూతనంగా ఐదు అంతస్తులతో మొత్తం 253 పడకలతో కూడిన ఆసుపత్రిని నిర్మించేందుకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేసి నిధులు కేటాయించారన్నారు. దీంతోనే ప్రస్తుతం అతి నవీన ఆసుపత్రిని రోగులకు అందజేస్తున్నామన్నారు. వీటిని ఈ ప్రాంతంలోని రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోగులకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని వీటితో పాటూ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే వేలూరు జిల్లా అనకట్టులో ప్రభుత్వాసుపత్రి నిర్మించడానికి పనులను ప్రారంభించనున్నామని ప్రస్తుతం సత్‌వచ్చారిలో రూ. 22 లక్షలతో పీహెచ్‌సీ నిర్మాణ పనులు, రూ. 50 లక్షలతో కల్లపాడిలో పీహెచ్‌సీ భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ముందుగా ఆసుపత్రిలోని నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కదీర్‌ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, ఆరోగ్యశాఖ అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


