అన్బుమణి ఇంటర్వూలు | - | Sakshi
Sakshi News home page

అన్బుమణి ఇంటర్వూలు

Jan 28 2026 7:02 AM | Updated on Jan 28 2026 7:02 AM

అన్బు

అన్బుమణి ఇంటర్వూలు

– ఆశావహుల రాక

సాక్షి,చైన్నె : తన మద్దతు ఆశావహులతో ఇంటర్వ్యూలపై పీఎంకే నేత అన్బుమణి దృష్టి పెట్టారు. మంగళవారం చైన్నెలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల కమిషన్‌ ద్వారా పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్న అన్బుమణి ఎన్నికలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమితో కలిసి పయనించనున్నట్టు ప్రకటించారు. ఇందులో 20లోపు సీట్లు అన్బుమణి శిబిరానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులలో తన తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలపై అన్బుమణి దృష్టి పెట్టారు. చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న వారితో ఇంటర్వ్యూలకు చర్యలు తీసుకున్నారు. తొలి రోజున చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, కోయంబత్తూరు, నీలగిరి, తిరుచ్చి జిల్లాలకు చెందిన ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు. 28వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆ తదుపరి వీరిలో తమకు కేటాయించే నియోజకవర్గాల మేరకు అభ్యర్థులను అన్బుమణి ఎంపిక చేయనున్నారు. కాగా, నిన్నటి వరకు డీఎంకేతో దోస్తీ కట్టాలన్న యోచన దిశగా రాందాసు శిబిరం ముందుకు సాగిన విషయం తెలిసిందే. అయితే,డీఎంకే నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో తాజాగా డీఎంకేకు వ్యతిరేకంగా రాందాసు గళం విప్పడం గమనార్హం. విద్యా రుణాల మాఫీ మాటేమిటో అంటూ సీఎం స్టాలిన్‌ను ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు.

విజయవంతంగా పెనాంగ్‌ పర్యాటక రోడ్‌ షో

సాక్షి,చైన్నె : సింప్లీ పెనాంగ్‌ నినాదంతో చైన్నెలో పెనాంగ్‌ రోడ్‌ షో విజయవంతంగా మంగళవారం జరిగింది. భారత్‌, పెనాంగ్‌ మధ్య పర్యాటక, వర్తక రీత్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది. దేవ వ్యాప్తంగా పెనాంగ్‌ నేతృత్వంలో జరుగుతూ వస్తున్న రోడ్‌ షో కార్యక్రమం మంగళవారం చైన్నెకు చేరింది. వీఎం 2026 పేరిట 9వ ఎడిషన్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెనాంగ్‌ దేశ ప్రతినిధులు, దౌత్య వేత్తలు హాజరయ్యారు. భారతీయ పౌరులకు వీసా మినహాయింపు కొనసాగింపు , ప్రయాణ సౌలభ్యం విస్తృతం, పర్యాటకం, వర్తక కార్యక్రమాలు రెండింటి బలోపేతం చేస్తూ ఈ రోడ్‌ షోలో నిర్ణయాలు తీసుకున్నారు. పెనాంగ్‌ రోడ్‌ షో టూ ఇండియా 2026 విజయవంతంగా జరిగిందని పెనాంగ్‌ దౌత్య, పర్యాటక అధికారులు స్థానికంగా ప్రకటించారు.

చైన్నె వేదికగా ట్రాక్‌ ఆసియా కప్‌

సాక్షి, చైన్నె: యూసీఐ క్లాస్‌ 2 ట్రాక్‌ సైక్లింగ్‌ పోటీలకు చైన్నెను వేదికగా ఎంపిక చేశారు. ట్రాక్‌ ఆసియా కప్‌ 2026 పేరిట ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఎస్‌డీఏటీ సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. తమిళనాడు సైక్లింగ్‌ అసోసియేషన్‌, స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ తమిళనాడు సహకారంతో జరుగుతున్న ఈ పోటీల అంతర్జాతీయ ట్రాక్‌ సైక్లింగ్‌కు 11 దేశాల నుంచి 70 మంది అంతర్జాతీయ సైక్లిస్టులు హాజరు కానున్నారు. అలాగే ఎస్‌డీఏటీ సైకిలిస్టులతో సహా 50 మంది భారతీయ సైక్లిస్టులు ఈ పోటీలకు తరలి రానున్నారు. 11 ఈవెంట్లుగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయంపై స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సభ్యకార్యదర్శి జె. మేఘనాథరెడ్డి మాట్లాడుతూ, ఎస్‌డీఏటీ వెలోడ్రోమ్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సీఎఫ్‌ఐ, టీఎన్‌సీఏ మధ్య బలమైన సహకారం, కొత్త ప్రమాణాలను నిర్దేశించి ఉన్నట్టు వివరించారు. తమిళనాడు సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌, సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి మణీందర్‌ పాల్‌ సింగ్‌ పేర్కొంటూ, యూసీఐ క్లాస్‌ 2 ఈవెంట్‌ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతుందని ప్రకటించారు.

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు చైన్నె వాటర్‌ బోర్డు సమాలోచన

కొరుక్కుపేట: తాగునీటి వినియోగదారుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి కొత్త స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని చైన్నె వాటర్‌ బోర్డు విభాగం సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాగునీటి బోర్డు అందించే నీటికి (దీనిని ఎక్కువగా వాణిజ్య సంస్థలు ఉపయోగిస్తాయి) వినియోగదారులు పన్ను చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో వినియోగ స్థాయిని తెలుసుకునేందుకు కొత్త స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే తాగునీటిని, నీటిని ఉపయోగించే భవనాలు మెట్రోలలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అన్బుమణి ఇంటర్వూలు 1
1/1

అన్బుమణి ఇంటర్వూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement