బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
తిరుత్తణి: కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలైన తమను ఆదుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేయాలని కర్లంబాక్కం దళితవాడ ప్రజలు ఆర్డీఓను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. తిరుత్తణి ఆర్డీఓ కణిమొళిని శనివారం కలుసుకున్న పళ్లిపట్టు యూనియన్ కర్లంబాక్కం దళితవాడకు చెందిన కుటుంబీకులు వినితిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతనెల కర్లంబాక్కం ఎస్సీ కాలనీలో 35 మంది అనారోగ్యం పాలయ్యారు. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాగునీటిలో కలుషిత నీరు మిశ్రమం కావడంతోనే గ్రామీణులకు అనారోగ్యం చోటుచేసుకున్నట్లు తెలియడంతో బీడీఓ కార్యాలయ అధికారులు కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో మృతి చెందిన ఏలుమలై అనే వ్యక్తి మృతదేహం పోస్టుమార్టంలో తాగునీటిలో పురుగులు చేరడంతోనే మృతి చెందినట్లు మరణ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపినట్లు, 35 మంది అనారోగ్యంతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నట్లు వాపోయారు. తమకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించి ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు.


