అగూర్‌లో సుబ్రహ్మణ్యస్వామి చిద్విలాసం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాత్రి అగూరులో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి పల్లకి మోసే కార్మికులకు చెందిన గ్రామాల్లో ఏడాదిలో ఒక్కరోజు సుబ్రహ్మణ్యస్వామి ఊరేగి దర్శనభాగ్యం కల్పించడం పరిపాటి. ఆ ప్రకారం తిరుత్తణి, ఎగువ తిరుత్తణి, అగూరు, ధరణివరాహపురం, పట్టాభిరామపురం, కుమారకుప్పం గ్రామాల్లో స్వామి విహరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అగూరులో విహరించారు. కొండ నుంచి మెట్లు మార్గంలో అగూరుకు చేరుకున్న శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు అభిషేక పూజలు చేపట్టి విశేష అలంకరణలో గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామివారు ఊరేగింపు సందర్భంగా గ్రామ వీధులు విద్యుద్దీపాలతో కనువిందు చేశాయి. రాత్రి స్వామి ఊరేగింపు పూర్తి చేసుకుని అర్ధరాత్రి కొండ ఆలయం చేరుకున్నారు.


