170 స్థానాలకు టార్గెట్
అన్నాడీఎంకే కసరత్తులు
మిత్రులకు 64తో సర్దుబాటు
అవసరం అయితే, రెండాకుల
చిహ్నంతో పోటీకి సూచన
ముగిసిన ఇంటర్వ్యూలు
సాక్షి, చైన్నె: రానున్న ఎన్నికల్లో 170 స్థానాలలో తాము పోటీ చేయడం లక్ష్యంగా అన్నాడీఎంకే కసరత్తులు చేపట్టింది. మిత్రులకు 64 సీట్లను సర్దుబాటు చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే, చిన్న పార్టీలు అవసరం అయితే, తమ రెండాకుల చిహ్నంలో పోటీ చేసే విధంగా సూచన ఇవ్వడానికి ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సన్నద్ధమయ్యారు.
అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ, అన్బుమణి పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం కీలక పార్టీలుగా ఉన్నాయి. ఐజేకే, పుదియ నీది చిన్న పార్టీలు అనేకం కూటమిలో ఉన్నాయి. కూటమి నేతల పరిచయ వేడుక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విజయవంతంగా శుక్రవారం జరిగింది. మరికొన్ని పార్టీలు సైతం కూటమిలోకి వస్తాయని పళణిస్వామి ప్రకటించారు. ఈ పరిస్థితులలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలోని 234 స్థానాలు ఉండగా, ఇందులో కీలక మిత్రులకు 64 స్థానాలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మిగిలిన 170 స్థానాలలో అన్నాడీఎంకే తరఫున అభ్యర్థులు పోటీలో ఉండే దిశగా పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. చిన్న పార్టీలు, తమతో కలసి వచ్చే ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు రెండాకుల చిహ్నంలోనే పోటీ చేసే విధంగా మెలిక పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఆ దిశగా పది స్థానాలు వెళ్లినా, మిగిలిన 160 స్థానాలలో తమ అభ్యర్థుల్నే నిలబెట్టనున్నారు. ఎలాగైనా సంపూర్ణ మెజారిటీతో అఽధికార పగ్గాలు చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో కసరత్తుల వేగాన్ని పళణిస్వామి పెంచారు.
ముగిసిన ఇంటర్వ్యూలు
పార్టీ తరఫున పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులను గత నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాయ పేటలోని పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో దరఖాస్తులను అన్నాడీఎంకే స్వీకరించిన విషయం తెలిసిందే. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో 28 నుంచి 31వ తేదీ వరకు సైతం గడువు అదనంగా కేటాయించారు. ఈ ప్రక్రియ ద్వారా 10,175 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,187 దరఖాస్తులు కేవలం పళణిస్వామి కోసం సమర్పించారు. తమ నియోజకవర్గంలో అంటే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని పళణికి విజ్ఞప్తి చేసిన వారు ఎక్కువే. ఇక, మిగిలిన 7,988 దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించారు. జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల నిర్వహణపై పళణిస్వామి దృష్టి పెట్టారు. ఆ మేరకు గత రెండు వారాలుగా ఇంటర్వ్యూలు జరుగుతూ వచ్చాయి. శనివారం విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీవీ షణ్ముగం సైతం తాజాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈప్రక్రియ ముగియడంతో ఇందులోని ముఖ్యులు, పలుకుబడి కలిగిన వారి పేర్ల ఆధారంగా మరో జాబితా సిద్ధంచేయనున్నారు. వీరిని మళ్లి పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించడమా లేదా తుది జాబితాను సిద్ధం చేయడమా అనే దిశగా జిల్లాల కార్యదర్శులతో చర్చించేందుకు పళని చర్యలు చేపట్టారు.
170 స్థానాలకు టార్గెట్


