పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
పళ్లిపట్టు: పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఉత్సాహంగా సాగింది. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 1983–90 విద్యా సంవత్సరాల్లో 6వ తరగతి నుంచి ప్లస్‌టూ వరకు చదువుకున్న 50 మంది పూర్వ విద్యార్థులు చదువు తర్వాత తలోదిక్కు వెళ్లిపోయారు. వారిలో చాలామంది ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. 35 సంవత్సరాలు తరువాత పాఠశాల మిత్రులను కలుసుకోవాలన్న వారి ఆశయాలకు వాట్సప్ సాయం అందించింది. అందరి సెల్‌ఫోన్ నెంబర్లు స్వీకరించి గ్రూపుగా ఏర్పడి అపూర్వ కలయిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బలిజకండ్రిగలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా కలుసుకుని ఒకే విధమైన దుస్తులు ధరించి చిన్నపిల్లల్లా మారిపోయారు. తరగతి గదిలో వారి పాత అనుభవాలు, పాఠశాల నేర్పిన క్రమశిక్షణ, విద్య, వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల వివరాలను ఆహ్లాదకర వాతావరణంలో పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్ధులుగా మారి ముచ్చటించుకున్నారు. చివరగా అందరం కలిసి గ్రూప్ ఫొటో దిగి ఆనందంగా వెనుదిరిగారు.


