క్లుప్తంగా
ఐదుగురు రౌడీలు అరెస్టు
తిరువొత్తియూరు: పెరంబూరు, పులియంతోపులో ప్రజలను బెదిరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్న ఐదుగురు రౌడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నె పులియంతోపు, అంబేడ్కర్ నగర్, 4వ వీధిలోని ఇళ్ల తలుపులను, గత 2 రోజులుగా అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి కొందరు తలుపులు కొట్టి ఆ ప్రాంత ప్రజలకు భయపెడుతున్నట్టు తెలిసింది. ఈ సంఘటనలో పులియంతోపు, కన్నికాపురం ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (20)విజయ్ (19), కార్తీక్ , (26) సతీష్(32) అని తెలిసింది. వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు కూడా పోలీసులకు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అదే విధంగా సెంబియం పోలీసు స్టేషన్ పరిధిలోని పెరంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర మద్యం మత్తులో రౌడీ అయిన పల్లవరం అమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన సక్కరై అనే వ్యక్తిని సెంబియం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
వైభవం.. వసంత పంచమి
కొరుక్కుపేట: నగర శివారు పెరియపాళయం సమీపంలోని ఆర్యపాక్కంలోని శ్రీ విద్యారంభ జ్ఞాన మహా సరస్వతిదేవి ఆలయంలో 11వ వార్షిక వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల వరకు సాగాయి. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బడిలో చేర్చాలనుకుంటున్న ఐదుగురు చిన్నారులతో అక్షరాభ్యాసం కోసం వారికి పలక, బలపం, బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. గోపూజ, సకల దేవతాయాగం, సరస్వతిదేవి మహా అలంకారాభిషేక ఆరాధన, తిరువారాధనం, ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యపాక్కం ఆలయం నుంచి మహిళలు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చిన 108 కలశాలల్లోని పాలతో అమ్మవారిని అభిషేకించారు. సరస్వతి తాయారును ప్రత్యేకంగా అలంకరించి లోక కల్యాణార్థం పూజలు నిర్వహించారు. గురుస్వామి భక్తవత్సలం, ఆలయ ధర్మకర్త పీవీ.కృష్ణారావు, మనిమాలరావు పాల్గొన్నారు.
భవనం పైనుంచి పడిన పెయింటర్
అన్నానగర్: చైన్నెలోని షెనాయ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇజాజ్ అహ్మద్(23) పెయింటర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను గత 2 సంవత్సరాలుగా వడపళనిలోని ఒక ప్రసిద్ధ వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్న సినిమా థియేటర్‌లో పని చేస్తున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకు ఇజాజ్ అహ్మద్ స్క్రీన్ నంబర్–3లోని ప్రొజెక్టర్ గదిలో 30 అడుగుల ఎత్తులో నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో అతను అనుకోకుండా పడిపోయాడు. ఇందులో ఇజాజ్ అహ్మద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు రక్షించి చికిత్స కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాధంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ వడమధురై ప్రాంతానికి చెందిన గఫూర్‌బాషాకు షబీర్‌ఖాన్(22), సల్మాన్(19) ఇద్దరు కుమారులు. సల్మాన్ శనివారం ఉదయం తన స్నేహితుడైన ముబ్సార్‌అలీతో కలసి ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. లచ్చివాక్కం వద్ద వెళుతుండగా మరో బైక్ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడేజ తీవ్రంగా గాయపడిన ముబ్సార్‌అలీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పుహలేంది(22). ఇతను ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పెద్దపాళ్యం– సెంగుడ్రం మార్గంలో వున్న కూరగాయల దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ పుహలేంది బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పుహలేంది మృతిచెందాడు.
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
సేలం: గంజాయి కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈరోడ్ కరుంగల్‌పాళయం పోలీసులు చున్నంబు ఓడై ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఈరోడ్‌లోని రఘుపతి నాయకన్‌పాళయం ప్రాంతానికి చెందిన ప్రతాప్ (23) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి కిలో 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, ఈరోడ్‌లోని పన్నీర్‌సెల్వం పార్క్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న మనల్మేడు ప్రాంతానికి చెందిన రాము (31)ను పోలీసులు అరెస్టు చేసి, 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోడ్‌కు చెందిన వైరవేల్ (24)ను సూరంపట్టిలోని అన్నానగర్‌లో గంజాయి అమ్ముతున్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కిలో 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాణిక్కం పాలయం హౌసింగ్ బోర్డు ప్రాంతంలో పెరియవలసు ప్రాంతానికి చెందిన ఇళయరాజా (35)ను అరెస్టు చేసి, అతని నుంచి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, కడ్తూరు సమీపంలోని తట్టంబుదూర్‌లో గంజాయి అమ్ముతున్న అలుకులికి చెందిన వేల్‌మురుగన్ (23), అయికావుండంబలైలో గంజాయి అమ్ముతున్న అదే ప్రాంతానికి చెందిన రంజిత్‌కుమార్ (24)ను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


