బ్రాడ్‌వే రూపురేఖలు సిద్ధం
సాక్షి, చైన్నె : బ్రాడ్ వే బస్టాండ్ స్థానంలో బ్రహ్మాండ మాల్ నిర్మాణానికి సంబంధించిన పనులకు సన్నద్ధమయ్యారు. ఉత్తర చైన్నెను ఆధునిక ఐకాన్‌గా తీర్చిదిద్దే విధంగా నిర్మాణాలు జరగనున్నాయి. బ్రాడ్ వే బస్టాండ్‌కు వెళ్లే బస్సులన్నీ తాజాగా ఐలాండ్ గ్రౌండ్, రాయపురం బస్టాండ్‌ల నుంచి పలు మార్గాలలో పయనించనున్నాయి.
ఉత్తర చైన్నె పరిధిలోని బ్రాడ్‌వే బస్టాండ్ నుంచి ఎంటీసీ బస్సులు నగరంలో పలు ప్రాంతాల వైపుగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టుకు కూతవేటు దూరంలో ఈ బస్టాండ్ ఉంది. బ్రాడ్ వే (ప్యారిస్) అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తున్నది. ఇక్కడి ఒక్కో విధి ఒక్క వస్తువుకు ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీంతో ఈ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. ఈ ప్రభావం ఉత్తర చైన్నె పరిధిలోని పలు ప్రాంతాలపై సైతం పడుతుంటుంది. ఈ పరిస్థితులలో ఈ బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ బస్టాండ్‌ను కామరాజర్ సాలైలోని ఐల్యాండ్ గ్రౌండ్‌కు మార్చేందుకు నిర్ణయించారు.
బ్రహ్మాండ నిర్మాణాలు..
బ్రాడ్ వే బస్టాండ్ ఉన్న ప్రాంతంలో 9 అంతస్తులతో బ్రహ్మాండ మాల్ నిర్మించేందుకు సీఎండీఏ నిర్ణయించింది. రూ.823 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ. 200 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ప్రైవేటు సహకారంతో సమీకరించేందుకు నిర్ణయించారు. మాల్‌తో పాటు ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులకు తగ్గ రూపురేఖలతో నాలుగు రకాల నమూనాను ఇటీవల విడుదల చేశారు. అదే సమయంలో ఐల్యాండ్ గ్రౌండ్‌లో తాత్కాలిక బస్టాండ్‌కు అవసరమైన అన్ని పనులు చేపట్టడంలో జాప్యం తప్పలేదు. అలాగే, బ్రాడ్‌వేకు ఐలాండ్ గ్రౌండ్‌కు మధ్య దూరం అధికంగా ఉండడంతో ఆపరిసర వాసులు అసంతృప్తిని వ్యక్తం చేసే పనిలో పడ్డారు.
ఎట్టకేలకు రాయపురం, ఐలాండ్ గ్రౌండ్ నుంచి సేవలు
గత ఏడాది ఐలాండ్ గ్రౌండ్‌కు బ్రాడ్‌వే బస్టాండ్‌ను తాత్కాలికంగా మార్చేందుకు సన్నద్ధమైనా, పనులు ముందుకు సాగాలేదు. చివరకు బ్రాడ్ వే బస్టాండ్‌ను రెండు ముక్కలు చేయక తప్పలేదు. ఇక్కడి నుంచి రోజుకు 140 రూట్లలో 864 బస్సులు 4,051 ట్రిప్పులు సేవలు అందించేవి. దీనిని తాజాగా విభజించారు. కొన్ని బస్సులను ఐలాండ్ గ్రౌండ్‌కు మారుస్తూ, ఇక్కడ తాత్కాలిక వసతులతో బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 67 రూట్లలో బస్సుల సేవలు శనివారం వేకువజామున 4.30 గంటల నుంచి ప్రారంభమైంది. మంత్రులు శివశంకర్, శేఖర్‌బాబు జెండా ఊపి బస్సుల సేవలను ప్రారంభించారు. అలాగే, రాయపురం బస్టాండ్ నుంచి మరో 73 మార్గాలలో బస్సుల సేవలు మొదలయ్యాయి. ఈ దృష్ట్యా, శనివారం నుంచి బ్రాడ్ వే బస్టాండ్ మూత పడ్డట్లైంది. ఇక, ఇక్కడ పనుల వేగం పెంచబోతున్నారు.


