పన్నీరు గుడారం ఖాళీ
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరుసెల్వం గుడారం ఖాళీ అవుతోంది. ఆయన సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు ధర్మర్ మళ్లీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పక్షాన చేరారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకుంటానంటూ మాజీ సీఎం పన్నీరుసెల్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు అన్నింటా ఓటమి తప్పలేదు. అయినా, తన మద్దతు దారులు తన వెన్నంటే అని చాటుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మనోజ్ పాండియన్, వైద్యలింగం డీఎంకే గూటికి చేరారు. మరో మాజీ ఎమ్మెల్యే రామలింగం రాజకీయాల నుంచే ఏకంగా తప్పుకున్నారు. మరో సీనియర్‌నేత జేసీటీ ప్రభాకర్ టీవీకేలో చేరారు. ముఖ్య నేతలందరూ పన్నీరు వీడి బయటకు వెళ్లూ వచ్చిన నేపథ్యంలో త్వరలో ఆయన శిబిరం ఖాళీ కావడం తథ్యం అన్న చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం రామనాథపురం జిల్లాలోని పన్నీరు మద్దతుదారులందరూ మళ్లీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి పక్షాన చేరారు. ఇందులో రాజ్యసభ సభ్యుడు ధర్మర్ కూడా ఉన్నారు. ఆ జిల్లాలో ఉన్న పన్నీరు శిబిరం అంతా మళ్లీ మాతృగూటిలోకి రావడంతో రామనాథపురం ఖాళీ అయింది. డెల్టా జిల్లాల్లో ఉన్న నేతందరూ డీఎంకే వైపు వెళ్తుండడంతో అక్కడ కూడా పన్నీరు బలం తగ్గింది. దక్షిణ తమిళనాడులోనూ పన్నీరు బలం సన్నగిళ్లడంతో తర్వాత ఆయన రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతున్నదో అనే చర్చ ఊపుందుకుంది. ఆయన రాజకీయాల నుంచి వైదొలగేనా లేదా, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునేనా అన్న చర్చ మొదలైంది. ఈ సమయంలో పన్నీరు సెల్వంతో మంత్రి శేఖర్‌బాబు అర గంట పాటు భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది.


