12 స్థానాలపై కమల్ దృష్టి
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమితో పయనించేందుకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం సన్నద్ధమైంది. అయితే, 12 సీట్లను ఆశించేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. 2021 ఎన్నికలలో మక్కల్ నీది మయ్యం ఒంటిరిగా వెళ్లిన విషయం తెలిసిందే. ఆపార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలు కాగా, పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించి, తమ మద్దతును డీఎంకేకు ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా కమల్‌ను రాజ్యసభకు డీఎంకే పంపించింది. ఈ పరిస్థితులలో 2026 ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు కమల్ సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా శనివారం చైన్నెలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ నేతలు అరుణాచలం, ఏజీ మౌర్య, సెంథిల్ మురుగన్, అబ్బాస్, శ్రీప్రియ, అర్జున జాన్సన్, రాజేష్ పాల్గొన్నారు. తమకు పట్టు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలలో రెండు, మూడో స్థానం దక్కించుకున్న నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఇందులో నుంచి 12 స్థానాలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ స్థానాలలో పోటీ చేయడానికి నిర్ణయించి, ఆ సీట్లను డీఎంకే వద్ద కోరేందుకు కమల్ సన్నద్ధమయ్యారు. ఈ విషయంగా త్వరలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను కమల్ కలవనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పార్టీకి మళ్లీ దక్కిన బ్యాటరీ టార్చ్ లైట్ చిహ్నంను మరింతగా ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ తరఫున కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నిర్ణయించారు.


