మూడు ముక్కలుగా పీఎంకే
– కాడు వెట్టి గురు వారసురాలి కొత్త పార్టీ
సాక్షి, చైన్నె: వన్నియర్ సంఘం దివంగత నేత కాడు వెట్టి గురు కుమార్తె విరుదాంబిగై కొత్తపార్టీని ప్రకటించారు. ఇది కాస్త పీఎంకేను మూడు ముక్కలు చేసినట్టైంది. వన్నియర్ సంఘానికి కాడు వెట్టి గురు ఒకప్పుడు కీలక నేత. ఆయన ద్వారానే పీఎంకే ఆవిర్భావం అన్నది రాందాసు రూపంలో జరిగిందన్నది చర్చ. కాడు వెట్టి గురు జీవించి ఉన్నంత కాలం పీఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణం తదుపరి పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అయితే, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు శిబిరంగా , అన్బుమణి శిబిరంగా పార్టీ రెండు ముక్కలై ఉంది. ఇప్పుడు అది కాస్త మూడు ముక్కలైనట్టుగా పరిస్థితి మారింది. ఇందుకు కారణం వన్నియర్లను ఏకం చేస్తూ కాడు వెట్టి గురు కుమార్తె విరుదాంబిగై కొత్త పార్టీని ఆదివారం ప్రకటించారు. దీనికి గురు పీఎంకే అని నామకరణం చేశారు. సేలం జిల్లా ఓమలూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను విరుదాంబిగై ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, అన్బుమణిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వన్నియర్లను చంపేసిన అన్నాడీఎంకేతో చేతులు కలపడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్బుమణి ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుచరుడిగా మారారని ఆరోపించారు. బీజేపీ లో ఇంత వరకు ఒక్క వన్నియార్ అభ్యర్థికీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదన్నారు. ఇలాంటి వారితో అన్బుమణి చేతుల కలపడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. తన తండ్రి గురు లేకుండా ఉండి ఉంటే రాందాసు, అన్బుమణి లేరని పేర్కొంటూ, వీరికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. సౌమ్య అన్బుమణి పోటీ చేసే నియోజకవర్గంలో ఆమెకు ప్రత్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.


