ఆశావహులతో పళణి ఇంటర్వ్యూ
సాక్షి, చైన్నె: ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలకు శుక్రవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి శ్రీకారం చుట్టారు. చైన్నె వేదికగా ఈనెల 13 ఇరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అదేసమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలోని బృందం పళని స్వామితో భేటీ అయింది. సీట్ల పందేరం సజావుగా, సంతృప్తికరంగా జరుగుతున్నట్టు నైనార్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల కసరత్తులను అన్నాడీఎంకే వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమిలోకి బీజేపీ, అన్బుమణి నేతృత్వంలోని పీఎంకేలు చేరాయి. మరికొన్ని పార్టీలు త్వరలో చేరతాయని పళణి చెబుతున్నారు. అదేసమయంలో బుధ, గురువారం ఢిల్లీలో పర్యటించిన పళణిస్వామి తాజాగా ఆశావహులతో ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారు.
ఆశావహులతో ఇంటర్వ్యూలు
పార్టీ తరఫున పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులను గత నెల 15 నుంచి 23వ తేదీ వరకు రాయ పేటలోని పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో దరఖాస్తులను స్వీకరించారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 28 నుంచి 31వ తేదీ వరకు గడువు కేటాయించారు. ఈ ప్రక్రియ ద్వారా 10,175 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,187 దరఖాస్తులు కేవలం పళణిస్వామి కోసం సమర్పించారు. తమ నియోజకవర్గంలో అంటే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని పళణికి విజ్ఞప్తి చేసిన వారు ఎక్కువే. ఇక, మిగిలిన 7,988 దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించారు. జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల నిర్వహణపై పళణిస్వామి దృష్టి పెట్టారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆశావహులను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలపై ఏ మేరకు పట్టుందో, ప్రజాబలం ఏ విధంగా ఉన్నదో వంటి పలు అంశాలపై ప్రశ్నలతో ఈ ఇంటర్వ్యూలు ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నాయి.
పళణితో నైనార్ భేటీ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ అయ్యారు. ఎన్‌డీఏలోకి వచ్చే కొన్ని పార్టీలకు తాము సీట్లను సర్దుబాటు చేసుకుంటామని, అందుకు అనుగుణంగా స్థానాలను కేటాయించాలని నైనార్ సూచించినట్టు సమాచారం. అన్నాడీఎంకేతో కాకుండా తమతో కలిసి వచ్చే వారికే తాము సీట్లను సర్దుబాటు చేసుకుంటామని బీజేపీ పేర్కొంటున్నా, ఇందులో ఎవరెవరు ఉన్నారో అన్న వివరాల సేకరణపై పళణి దృష్టిపెట్టినట్టు సమాచారం. అమిత్‌షా పళణిస్వామికి హుకుం జారీ చేసినట్టుగా చర్చ జరుగుతున్న సమయంలో నైనార్ భేటీ ప్రాధాన్యతకు దారి తీసింది. సంకీర్ణ ప్రభుత్వం, మంత్రి వర్గంలో చోటు గురించి ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ చర్చలు సంతృప్తికరంగా సాగుతున్నట్టు నైనార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఢిల్లీలో దినకరన్
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాత్రి భేటీ అయినట్టు తెలిసింది. అన్నాడీఎంకేలో కాకుండా, ఎన్‌డీఏలో కొనసాగే విధంగా టీటీవీ దినకరన్‌కు అమిత్ షా సూచనలు ఇచ్చినట్టు చర్చ ఊపందుకోవడం గమనార్హం. పళణిస్వామి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని దినకరన్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎన్‌డీఏ కూటమిలో కొనసాగేందుకు సంబంధించిన చర్చల్లో నిమగ్నమైనట్టు ప్రచారం ఊపందుకుంది. తనను ఎన్‌డీఏలోకి ఆహ్వానించిన పక్షంలో ,మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళను కూడా ఇదే కూటమిలోకి చేర్చేందుకు దినకరన్ తీవ్రవ్యూహాలతో ఢిల్లీలో తిష్టవేసి పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
ఆశావహులతో పళణి ఇంటర్వ్యూ


