నమ్మఊరు ఉత్సవం
సాక్షి, చైన్నె: చైన్నె సంగమం–నమ్మ ఊరు పండుగ కళా ప్రదర్శనలు సంక్రాంతి వేళ చైన్నెలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇందు కోసం 20 ప్రదేశాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ నెల 14 నుంచి 18 వరకు వేడుకలు హోరెత్తనున్నాయి. తమిళనాడు ప్రభుత్వం నేతృత్వంలో గ్రామీణ కలలను నగరవాసులకు పరిచయం చేసే విధంగా గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే రీతిలో సంక్రాంతి వేళ నమ్మ ఊరు ఉత్సవం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు వేదికలుగా వలసరవాక్కం, కొళత్తూరు, తాంబరం, కోయంబేడు, అశోక్ నగర్, టీనగర్, రాజా అన్నామలై పురం, చైన్నెలోని మెరీనా బీచ్, ఎలియట్స్ బీచ్, తిరువాన్మియూరు బీచ్, వళ్లువర్ కోట్టం, సెమ్మోళి పార్కు, ఎగ్మూర్ మ్యూజియం తదితర 20 ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ పరిసరాలన్నీ గ్రామీణ వాతావరణంలో మునిగే విధంగా ఏర్పాట్లుకు చర్యలు చేపట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి
ఎంకే స్టాలిన్ ఈనెల 14వ తేదీన చైన్నె సంగమం ఉత్సవాలను ఎగ్మూర్‌లో ప్రారంభించనున్నారు. 15 నుంచి 18వ తేదీ వరకు చైన్నెలో 20 చోట్ల సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. 1500 మందితో కూడిన కళా బృందాలు 50కు పైగా వివిధ కళా రూపాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ కళాకారుల వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలు, వస్త్రాలన్నీ ప్రభుత్వం ఉచితంగా అందజేయనున్నది. అలాగే రోజుకు వేతనం కూడా అందించనున్నారు.
ప్రత్యేక బస్సులు, రైళ్లు రెడీ
సంక్రాంతి పండుగకు ఈ సారి సెలవులు మరీ ఎక్కువే. దీంతో చైన్నె తదితర నగరాల్లోని వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లి ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో పండుగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు రెడీ అయ్యాయి. ప్రయాణీకుల కోసం చైన్నెలో ఆరు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చైన్నె నుంచి దక్షిణ తమిళనాడులోని మదురై, తిరుచ్చి, దిండుగల్, తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, డెల్టాలోని కడలూరు, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు వైపుగా, పశ్చిమ తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి వైపుగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులు చైన్నె కోయంబేడు, మాధవరం, పూందమల్లి, కేకే నగర్, తాంబరం శానిటోరియం, కీలంబాక్కం నుంచి ఆయా మార్గాలలో శుక్రవారం నుంచే రోడ్డెక్కించే పనిలో పడ్డారు. తొలిరోజు స్వల్పంగా బస్సులు నడిపినా, రానున్న రోజులలో సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక చైన్నె లో బోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనమ పర్వ దినాల కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. 15 వేల మంది విధులలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి.


