ఐఐటీలో సాంస్కృతిక సంబరం
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో సారంగ్ సాంస్కృతిక వేడుక ప్రారంభమైంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా వేడుకలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పద్మశ్రీ తోట తరణి హాజరయ్యారు. ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, డీన్ ప్రొఫెసర్ గుమ్మడి సత్యనారాయణ, సాంస్కృతిక సలహాదారుడు సుశాంత్ పాణిగ్రాహి, లల్గుడి జి.జే.ఆర్ కృష్ణన్, లల్గుడి విజయలక్ష్మి, సారంగ్ కార్యదర్శి సాయి సంకల్ప్‌ల జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు మొదలయ్యాయి. అనంతరం లల్గుడి కృష్ణన్, విజయలక్ష్మి కచేరి వీనుల విందుగా సాగింది. తర్వాత ప్రసన్న గిటార్ వాయిద్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రారంభోత్సవానికి ముందుగా సీఎల్‌టీ భవనంలో విద్యార్థులు తోట తరణితో స్పాట్ లైట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తోట తరణి సమాధానాలు ఇచ్చారు. రాజపార్వయ్ సినిమాతో తనకు ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు లభించిందని అన్నారు. కమలహాసన్, సింగీతం శ్రీనివాసరావుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. తండ్రి తోటవెంకటేశ్వరరావు, జి. సుబ్బారావు వంటి ఆర్ట్ డైరెక్టర్ల స్ఫూర్తితో ఆర్ట్ డైరెక్టర్ కాగలిగానని అన్నారు. మణిరత్నం, శంకర్, శ్రీనివాస్ శేఖర్ కమ్ముల డైరెక్టర్స్‌తో పని చేశానని వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన అభిరుచి అనితెలిపారు. అంజలి, నాయకన్, దళపతి, ఇండియన్, బాంబే, చంద్రముఖి, శివాజీ, అతడు, అర్జున్, పొన్నియిన్ సెల్వన్, హరిహరవీరమల్లు కుబేరన్, చాంపియన్ సహా200 చిత్రాలకు చేశానని చెప్పారు. నాయకన్ చిత్రం సందర్భంలో కమలహాసన్ మాట్లాడుతూ శ్రీఈ చిత్రంలో కథానాయకుడు నేను కాదు తోటతరణ్ఙి అని అభినందించారని గుర్తు చేశారు. తోటతరణి విద్యార్థులతో తన జీవిత, వృత్తి విషయాలను పంచుకున్నారు. తోటతరణి సతీమణి శారద, కుమార్తె అంజన పాల్గొన్నారు.
ఐఐటీలో సాంస్కృతిక సంబరం


