హార్బర్‌లో కొత్త ప్రాజెక్టులు
– ప్రారంభించిన సర్బానంద సోనోవాల్
సాక్షి, చైన్నె : చైన్నె కామరాజర్ హార్బర్‌లో కొత్త ప్రాజెక్టులను కేంద్ర జల వనరులు, హార్బర్ల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం ప్రారంభించారు. చైన్నె పర్యటనకు వచ్చిన ఆయన గురువారం అమెట్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. రెండో రోజుగా శుక్రవారం చైన్నె హార్బర్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియా డెవలప్డ్ పోర్ట్స్ ఇన్ చైన్నె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియన్ మారిటైమ్ వర్సిటీ విద్యార్థులు, పోర్టు కస్టమ్స్, ఇతర విభాగాల అధికారులతో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. 4 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్లతో అప్‌గ్రేడ్ డిజిటలైజ్ ప్రక్రియ, రూ. 10.5 కోట్లతో పునఃనిర్మించిన బ్రేక్ వాటర్ నిర్మాణాలను ప్రారంభించారు. మొత్తంగా రూ.230 కోట్లతో చైన్నె పోర్టు, కామరాజర్ పోర్టులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన పనులను ప్రారంభించారు. సాగర్‌మాల కార్యక్రమం గురించి వివరిస్తూ, వికసిత్ భారత్, వికసిత్ పోర్టుల గురించి ఈసందర్భంగా ఆయన వివరించారు. అలాగే, 11వ ఎస్‌డీఏటీ ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వబుద్ధిని స్కూల్‌ను సందర్శించారు. ఇక్కడున్న ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారికి కానుకలను అందజేశారు.
హార్బర్‌లో కొత్త ప్రాజెక్టులు


