కార్తీక బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
వేలూరు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీన దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభం కానున్నాయి. ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహిస్తారు. చివరిరోజున అరుణాచలేశ్వరాలయం ముందున్న మహాకొండపై మహాదీపాన్ని వెలిగించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈనెల 24వ తేదీన ద్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల ముందుగానే దుర్గమ్మ ఉత్సవంతో ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు సాయంత్రం 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. అలాగే దీపోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలోని తొమ్మిది రాజగోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించే పనిలో ఆలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఆలయ జాయింట్ కమిషనర్ భరణిధరన్ అధ్యక్షతన ఆలయ సిబ్బంది బ్రహ్మోత్సవ పనులను వేగవంతం చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ట్రాన్స్‌పోర్టు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మాట్లాడారు. మహా దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులకు శ్రమ లేకుండా వాహనా నిలిపే స్థలాలు, బస్సు రాక పోకలు తదితర ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్టు శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సుంజ్‌సంగమ్ జూదక్ సుకీ పేర్కొన్నారు. మహాదీపాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు తిరువణ్ణామలై రానున్నారని చెప్పారు. దీంతో ఏర్పాట్లను పరిశీలించేందుకు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి చేరుకుని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించామన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో తనిఖీలు చేశారు. కలెక్టర్ తర్పగరాజ్, ఆలయ జేసీ భరణీధరన్‌తో ఏర్పాట్లు గురించి చర్చించారు. ఆ సమయంలో ఉదయం భరణి దీపానికి ఎంత మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించాలన్నారు.


