వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాత్యాయిని మాట్లాడుతూ కోవైలో కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఎంకే ప్రభుత్వంలో అత్యాచారాలు, మాన బంగాలు, నేరాలు అధికమయ్యాయన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న వాటిని చూస్తూనే ఉన్నారని, త్వరలోనే డీఎంకే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతరం కోవైలో కళాశాల విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ, డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి వసంతప్రియ, మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.


