ఓటర్ల జాబితా మార్పుల్లో నిబంధనలు ఉల్లంఘన
వేలూరు: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు అధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం వేలూరు కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల పనులను ప్రారంభించిందని తెలిపారు. దీంతో పోలింగ్ అధికారి ప్రతి ఇంటికీ వెళ్లి దరఖాస్తులను నేరుగా అందజేయాలని ఆదేశించారు. అయితే వేలూరు పట్టణంలోని ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లకుండా ఒకే చోట కూర్చొని దరఖాస్తులను అందజేస్తున్నారని తెలిపారు. కాట్పాడిలో పదవీ విరమణ పొందిన వీరమ్మ అనే వృద్ధురాలి వద్ద దరఖాస్తులను ఇచ్చేందుకు నియమించారని, అయితే ఆమె నడవలేని పరిస్థితిలో ఉందని, దాంతో ఆమె మనవడు వెళ్లి దరఖాస్తులను అందజేస్తున్నాడని చెప్పారు. డీఎంకే పార్టీకి చెందిన ఆ మొత్తం దరఖాస్తులను తీసుకుని అతని మద్దతు ఓటర్లకు మాత్రమే దరఖాస్తులను అందజేస్తున్నారన్నారు. ఇదే తరహాలోనే జిల్లా వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా దరఖాస్తులను ఇంటింటికీ వెళ్లి అందజేసేందుకు పదవీ విరమణ పొందిన వారిని నియమించడంతో దాన్ని అసరాగా చేసుకుని డీఎంకే పార్టీకి చెందిన వారు వారి మద్దతుదారులకు మాత్రమే అందజేసి మిగిలిన వారిని గాలికి వదిలేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు, ఐటీ విభాగం రీజినల్ కార్యదర్శి జననీ సతీష్‌కుమార్, పట్టణ కార్యదర్శి వేలయగన్, తదితరులు పాల్గొన్నారు.


