64 ఏళ్ల వృద్ధుడికి కాలేయం మార్పిడి విజయవంతం
వేలూరు: నరువి ఆస్పత్రిలో కాలేయం పూర్తిగా పనిచేయక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 6 ఏళ్ల వృద్ధుడికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. నరువి ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన 64 ఏళ్ల వృద్ధుడి కాలేయం పూర్తిగా పని చేయక పోవడంతో వేలూరులోని నరువి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు కాలేయం మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నారు. దీంతో ట్రాన్స్‌టాన్ అనే తమిళనాడు ప్రభుత్వ అవయవదాన నియంత్రణ సంస్థలో అవయవ దాన మార్పిడికి లైసెన్స్ పొందిన నరువి ఆస్పత్రి ఆ సంస్థ ద్వారా అవయవాలను పొందేందుకు నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో చైన్నెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 24 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెత్ గురైనట్లు గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు యువకుడి అవయవాలు దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బ్రెయిన్‌డెత్ అయిన యువకుడి కాలేయాన్ని ట్రాన్స్‌టాన్ ద్వారా చైన్నె నుంచి నరువి ఆస్పత్రికి తీసుకొచ్చి వృద్దుడికి శస్త్రచికిత్స ద్వారా అమర్చి, విజయవంతం చేశారు. మొత్తం 12 మందితో కూడిన వైద్యబృందం కాలేయ మార్పిడిలో పాల్గొంది. మొత్తం 21 రోజుల పాటు వృద్ధుడు ఐసీయూలో ఉంటూ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఆరు నెలల అనంతరం వృద్ధుడు రోజు వారీ పనులు చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. నరువి ఆస్పత్రిలో కాలేయ మార్పిడిలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ అభినందించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.


