డీబీసీ కేంద్రంలో మొలకెత్తిన వరి
పళ్లిపట్టు: డీబీసీ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు గిడ్డంగికి తరలించక పోవడంతో వర్షానికి తడిచి మొలకెత్తి నిరుపయోగంగా మారుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పళ్లిపట్టు యూనియన్‌లోని రైతులు సాగు చేసిన వరి పంటను దిగుబడి చేసి బొమ్మరాజుపేట, నొచ్చిలి, వడకుప్పం ప్రభుత్వ డీబీసీ కేంద్రాల్లో విక్రయించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలను నిల్వ వుంచే కేంద్రాలు నిండిపోవడంతో ఆరు బయట వుంచారు. ఈక్రమంలో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తున్న క్రమంలో వరి బస్తాలకు అధికారులు కవర్లు కప్పి వుంచారు. అయితే భారీ వర్షంతో వర్షపు నీరు లోపలికి ప్రవేశించి వరి తడిచి ముద్దవుతోంది. వడకుప్పంలో డీబీసీ కేంద్రానికి బయట 500 బస్తాలు పది రోజుల నుంచి వుండడంతో వర్షానికి తడిచింది. బస్తాలు ముద్దగా మారి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీబీసీ కేంద్రాల్లో బయట వున్న వరి బస్తాలను వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాండ్రవేడు గ్రామానికి చెందిన రైతు నందకుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి బస్తాలు తరలించడంలో ఆలస్యం చోటుచేసుకుంటుండడంతో వర్షానికి నిరుపయోగంగా మారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


