క్లుప్తంగా
కారు దగ్ధం
తిరువొత్తియూరు: అడయారులో కారుకు మంటలు అంటుకొని దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి తండ్రీ, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణకు చెందిన వెంకటేశ్వర కుమార్తె పోరూరులో ఉంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ మెడిసిన్ చదువుతోంది. సోమవారం ఆమె చదువు పూర్తయిన సందర్భంగా ఆమెను తీసుకెళ్లడానికి తండ్రి వెంకటేశ్వర కారులో వచ్చారు. తండ్రీకూతుళ్లు సోమవారం రాత్రి బీసెంట్ నగర్ బీచ్ నుంచి మెరీనా బీచ్ వైపు కారులో బయలుదేరారు. అడయారు ఆవిన్ సెంటర్ దగ్గరకు రాగానే కారు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును ఆపి దిగిపోయారు. కొద్దిసేపటికే కారు మొత్తం మంటల్లో కాలిపోయింది. తిరువాన్మియూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. శాస్త్రి నగర్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
అప్పు చెల్లించలేదని కిడ్నాప్
తిరువొత్తియూరు: అప్పు చెల్లించలేదని ఓవ్యక్తిని దుండగలు కిడ్నాప్ చేశారు. విల్లుపురం జిల్లా, వనత్తి గ్రామానికి చెందిన శివ (40) వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బంధువుల వద్ద కొంత నగలు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తిరిగి చెల్లించకపోవడంతో అప్పుఇచ్చిన వారు మంగళవారం ఉదయం 8 గంటలకు అతని ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో చర్చలు సఫలం కాకపోవడంతో ఐదుగురు శివను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు కారును వెంబడించారు. పోలీసులు పట్టుకుంటారని భయపడి కారును రోడ్డుపై రాంగ్ రూట్‌లో నడిపారు. ఆ సమయంలో రోడ్డుపై వచ్చిన మూడు బైకులను ఢీకొట్టి చైన్నె– జాతీయ రహదారి వైపు వేగంగా వెళ్లారు. శివను, అతని కారును విల్లుపురం జాతీయ రహదారి జానకిపురం వద్ద వదిలిపెట్టి మరో కారులో పారిపోయారు. పోలీసులు శివను రక్షించి అతని వద్ద విచారణ జరుపుతున్నారు..
ఇంజినీర్ హత్య
తిరువొత్తియూరు: శివగంగై జిల్లాలో ఇంజినీర్‌ను హత్య చేసిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని బంధువులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. శివగంగై జిల్లా, కారైకుడి సమీపంలోని అరియకుడి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ కుమారుడు పళనియప్పన్ (34) సివిల్ ఇంజినీర్. ఇతను బీజేపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశాడు. ఇతనికి అరియకుడి, ఇలుప్పకుడి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాణిజ్య సముదాయంలో అద్దెకు ఉన్న వ్యక్తికి, పళనియప్పన్‌న్‌కు మధ్య దుకాణాన్ని ఖాళీ చేయడంపై కక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో సోమవారం పళనియప్పన్ పొన్ నగర్ ప్రాంతంలో తాను నిర్మిస్తున్న ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆరుగురు ఇంట్లోకి వెళ్లి పళనియప్పన్‌న్‌పై కత్తులతో దాడి చేశారు. గాయపడ్డ అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పళనియప్పన్ మృతిచెందాడు. విషయం తెలిసి కారైకుడి కళనివాసల్‌లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎదుట బంధువులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు.
అన్నానగర్‌లో కొత్త పరిశోధన కేంద్రం
సాక్షి, చైన్నె ఆర్తి స్కాన్ అండ్ ల్యాబ్ ఆధ్వర్యంలో చైన్నె అన్నానగర్‌లోని సెంటర్‌లో వైటల్ ఈన్‌సైట్స్ అనే భారతదేశపు మొట్టమొదటి దీర్ఘాయువు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆర్తి స్కాన్ వ్యవస్థాపక చైర్మన్ వి.గోవిందరాజన్ సమక్షంలో ప్రఖ్యాత స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఎ.టి.రాజామణి ప్రారంభించారు. గోవిందరాజన్ పనితీరును వివరించారు.
నగలు దోపిడీ
స్నేహితుడి సహా యువతి అరెస్ట్
తిరువొత్తియూరు: అరియలూర్ జిల్లా తురై సమీపంలో ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఈనెల 16వ తేదీన 60 ఏళ్ల మద్ధుడిపై ఓ మహిళ ఆమె స్నేహితుడు దాడి చేసి అతని వద్ద ఉన్న 6.5 సవర్ల నగలను దోచుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. వృద్ధుడి నుంచి నగలు దోచుకెళ్లిన అరియలూర్ జిల్లా ఆండిమటంకు చెందిన కలైయరసి (35), జయం గొండానికి చెందిన నవీనన్‌కుమార్ (30)ను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 సవర్లు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
జంట హత్యల కేసులో
ఐదుగురికి జీవిత ఖైదు
అన్నానగర్: మాంసం దుకాణం వివాదంలో జరిగిన జంట హత్య కేసులో ఐదుగురికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులో అక్టోబర్, 2015న జంట హత్యలు జరిగాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో మృతిచెందాడు. కేసు విచారణ కోయంబత్తూరు 5వ సెషన్‌న్స్ కోర్టులో జరుగుతోంది. సోమవారం కేసు విచారించిన న్యాయమూర్తి శివకుమార్ నేరం రుజువు కావడంతో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు.


