నిండుకుండల్లా.. ఆనకట్టలు
తిరువళ్లూరు: కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆనకట్టల నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి భారీ నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటూ ఆంధ్ర, వేలూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా భారీగా వరద నీరు వస్తుండడంతో జిల్లాలోని పూండి, పుళల్, చెమరంబాక్కం, చోళవరం, తేరువాయి కండ్రిగ–కన్నన్‌కోట రిజర్వాయర్‌లు పూర్తిగా నిండిపోయింది. దీంతో మిగులు జలాలను రిజర్వాయర్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని సుమారు వందకు పైగా చెరువుల్లో 75 శాతం పైగా నీరు చేరింది. గ్రామాల్లోని బావులు, చెరువులు, కొలనులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలోనే జిల్లాలో రిజర్వాయర్‌లు, చెరువుల తరువాత స్తానంలో ప్రధాన నీటి వనరుగా వున్న ఆనకట్టలు పూర్తిగా నిండిపోయాయి.
భారీగా నీటినిల్వ..
సురుటుపళ్లి చెక్‌డ్యామ్‌లో వంద మిలియన్ ఘనపరిమాణం, పనపాక్కం చెక్‌డ్యాడ్‌లో 10.97 మిలియన్ ఘణపరిమాణం, కల్పట్టులో 9.15 మిలియన్ ఘణపరిమాణం, చెంగాత్తుకుళం చెక్‌డ్యామ్‌లో 138 మిలియన్ ఘణపరిమాణం, పాళేశ్వరం చెక్‌డ్యామ్‌లో 98.84 మిలియన్ ఘనపరిమాణం, ఏఎన్‌కుప్పం చెక్‌డ్యామ్‌లో 98.55 మిలియన్ ఘనపరిమాణం, లక్ష్మీపురం చెక్‌డ్యామ్‌లో 300 మిలియన్ ఘణపరిమాణం, రెడ్డిపాళ్యం చెక్‌డ్యామ్‌లో 150 మిలియన్ ఘనపరిమాణం, ఆండార్‌మఠం డ్యామ్‌లో 22.60 మిలియన్ ఘనపరిమాణంతో పాటూ మొత్తం 927.31 మిలియన్ ఘనపరిమాణంలో నీటి నిల్వ ఉంది. దీంతో పాటూ తామరపాక్కం, పుట్లూరు, పుదుసత్రం, పింజివాక్కం, ఏకాటూరు చెక్‌డ్యామ్‌లు సైతం పూర్తిగా నిండి మిగులు జలాలు కిందికి వదిలి వెళ్ళుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు పూర్తీ స్తాయి నీటి మట్టానికి చేరిన క్రమంలో సమీప ప్రాంతాల్లోని బావులు, బోర్లులలో నీరు పుష్కలంగా లబించే అవకాశం ఉంది. ఇదేవిధంగా భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే కూవం, కుశస్థలి, ఆరణియార్ ద్వారా జిల్లాకు భారీగా వరద నీరు వస్తోంది. ఇదే సమయంలో అదనపు ఆనకట్టలు లేకపోవడంతో రోజులకు రెండు టీఎంసీల చొప్పున నీరు వృథాగా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. అదనపు ఆనకట్టలను నిర్మించాలని కోరుతున్నా పాలకులు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజుల క్రితం వరకు నీరు లేక ముళ్ల పొదలతో నిర్మానుష్యంగా కనిపించిన ఆనకట్టలు ప్రస్తుతం జళకళతో కళకళాడుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండల్లా.. ఆనకట్టలు
నిండుకుండల్లా.. ఆనకట్టలు


