ముంపు బాధితులకు కలెక్టర్ పరామర్శ
వేలూరు: వేలూరు జిల్లాలో వారం రోజులుగా తరచూ వర్షాలు కురుస్తుండటంతో వేలూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇల్లలోకి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో నివశిస్తున్న నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కనసాల్‌పేట, ఇందిరానగర్, అరియూరు, ముళ్ళిపాల్యం, గాంధీనగర్, జీవానగర్, వీజీరావ్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు వారం రోజులుగా తగ్గడం లేదు. కార్పొరేషన్ సిబ్బందిచే మోటర్లు ద్వారా నీటిని తొలగిస్తున్నప్పటికీ ఉబరి నీరు అధికంగా రావడంతో నీటిమట్టం తగ్గడం లేదు. దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కల్యాణ మండపాల్లో ఉంచి వారికి అవసరమైన కనీస వసతులతో పాటూ భోజన వసతులను జిల్లా యంత్రాంగం చేస్తుంది. అదేవిధంగా నీరు అధికంగా చేరిన ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కూడా మోటార్లు ద్వారా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నీరు చేరిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేయడంతో పాటూ బ్లీచింగ్ చల్లడం, వీధులను శుభ్రం చేయడం వంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ముంపు బాధితులను కలెక్టర్ సుబ్బలక్ష్మి, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్ నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.


