ఈసారి అధిక వర్షాలు: వాతావరణ కేంద్రం
నాలుగు జిల్లాలలో భారీ వర్షం
తిరుచెందూరులో 15 సెం.మీ వాన
మురుగన్ ఆలయంలోకి చేరిన నీరు
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ పవనాలతో తాజా సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్ష పాతం నమోదు అవుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పవనాల రాకతో కన్యాకుమారి, తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలో గురువారం భారీ వర్షం పడింది. తిరుచెందూరు మురుగన్ ఆలయం, శివాలయాలలోకి వరద నీరు చేరడంతో మూడు గంటలు శ్రమించి అధికారులు, సిబ్బంది తొలగించారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో తమిళనాడుకు అధిక వర్షం పడుతుందన్న విషయం తెలిసిందే. తాజా సీజన్‌లో సాధారంగా కురిసే 44 సెం.మీని అధిగమించి 50 సెం.మీ వర్షం పడే అవకాశం ఉందని తొలకరి పలకరింపు రోజే వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన శుభ సూచకంగా బుధవారం అర్థరాత్రి నుంచి కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాలో భారీ వర్షం పడింది. ఈ నాలుగు జిల్లాలకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరుచెందూరులో ఒక రాత్రి 15 సె.మీ వర్షం పడటంతో ప్రసిద్ధి చెందిన మురుగన్ ఆలయంలోకి, పక్కనే ఉన్న శివాలయంలోకి నీరు చేరింది. తూత్తుకుడి, తిరుచెందూరు, కోవిల్ పట్టి పరిసరాలలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు,రోడ్లు జలమయం అయ్యాయి. మూడు గంటల పాటుగా శ్రమించిన కార్పొరేషన్ వర్గాలు నీటిని తొలగించారు. తూత్తుకుడిలో ద్విచక్ర వాహనాల ప్రదర్శనలో ఉంచి 15 కొత్త మోటారు సైకిళ్లు వరదలో మునిగాయి. తెన్‌కాశి జిల్లా కుట్రాలంలో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. తామర భరణి నది లో నీటి పరవళ్లతో తీర వాసులకు అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ కనుల మలలోకురుస్తున్న వర్షాలతో తేని జిల్లా సొత్తుపారై జలాశయం నీటి మట్టం ఒకే 16 అడుగులు పెరిగింది. 126 అడుగులతో కూడిన ఈ జలాశయంలో ప్రస్తుతం 102 అడుగులుగా నీటి మట్టం ఉంది. నీటి రాకపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, జలాశయం నిండగానే ఉబరి నీటి విడుదలకు చర్యలు చేపట్టారు.
అల్పపీడనం
18వ తేదిన అరేబియా సముద్రంలో ఓ అల్పపీడనం, 24వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ అముదా ప్రకటించారు. ఈశాన్య రుతు పవనాల సీజన్ ప్రారంభమైందని పేర్కొంటూ, ఈ పవనాల రాకతో ఏడు చోట్ల అతి భారీ వర్షం పడిందన్నారు. తిరుచెందూరు,కోవిల్ పట్టిలలో 15 సె.మీ వర్షం పడిందని వివరించారు. తాజాగా 8 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటిస్తున్నామన్నారు. 20వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని, ఆ తదుపరి 23వ తేదీన నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయన్నారు. ఐదు రోజుల పాటుగా జాలర్లు మన్నార్ వలి గుడ, లక్ష దీవులు, దక్షిణ ఆంధ్రా, కేరళ సముద్ర తీరాల వైపుగా వెళ్ల వద్దు అని హెచ్చరించారు. చైన్నె, శివారులలో అక్కడక్కడ చెదరు ముదురుగా వర్షం పడింది. ఆకాశం మేఘావృతంగామారడంతో పాటుగా వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. దీంతో చైన్నె కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించేపనిలో పడింది. చూలైలో వర్షపునీరు చేరడంతో తొలగింపు పనులు వేగవంతం చేశారు. పుళల్,పూండి ల నుంచి నీటి విడుదలతో కుశస్థలీ నదీ తీరం వాసులను అప్రమత్తం చేశారు. ఈ తీరం వెంబడి గురువారం అధికారులు పరిశీలన చేశారు. ఇక, నీలగిరులలో అయితే చలి తీవ్రత హఠాత్తుగా పెరగడం గమనార్హం.
‘ఈశాన్యం’ పలకరింపు