
అన్బుమణిలో నాయకత్వ లక్షణాలు లేవు
సాక్షి,చైన్నె: అన్బుమణిలో నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవు అని ఆయన తండ్రి, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య సాగుతున్న సమరం గురించి తెలిసిందే. ఈ వివాదానికి కొద్దిరోజులు తెర పడింది. ఇందుకు కారణం రాందాసు అనారోగ్యంతో ఆస్పత్రిలోచేరడమే. ఆస్పత్రిలో ఉన్న రాందాసును పరామర్శించేందుకు అన్బుమణికి అవకాశం సైతం ఇవ్వలేదు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాందాసు గురువారం మీడియా తో మాట్లాడారు. 12 సంవత్సరాల తర్వాత తాను ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అందరూ తనను పరామర్శించేందుకు వచ్చారని, పోన్‌లో సంప్రదించారని గుర్తుచేశారు. తాను ఐసీయూ జనరల్ వార్డులో ఉన్నట్టు వివరించారు. అయితే, అన్బుమణి వ్యవహరించిన తీరు వేదన కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్బమణి తన కంటూ ఓ పార్టీ, జెండాను ఏర్పాటు చేసుకుంటే మంచిదంటూ సూచించారు. పీఎంకేతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటే పార్టీ పరంగా పదవి వస్తుందే గానీ, ఎమ్మెల్యే పదవీ మాత్రం రాదని హితవు పలికారు.అన్బమణికి నాయకత్వ లక్షణాలు లేవు అని, ఆయన్ను నమ్ముకున్న వారు మళ్లీ మాతృ గూటిలోకి రావడం ఖాయం అని వ్యాఖ్యలు చేశారు. పీఎంకేను తాను రెక్కల కష్టాలతో బలోపేతం చేశానని, ఇప్పుడు దానిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.