
150 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు
సాక్షి, చైన్నె : చైన్నె ఓఎమ్మార్‌లోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఐదు నెలల వ్యవధిలో 150 రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు ఆ హాస్పిటల్ ఆర్థోపెడికల్ సర్జన్‌లు డాక్టర్ వెంకటరమణన్ స్వామినాథన్, డాక్టర్ దామోదరన్ పిఆర్, డాక్టర్ సెంథిల్ కమలశేఖరన్, డాక్టర్ మదన్ తిరువేంగడ సంయుక్తంగా ప్రకటించారు. స్థానికంగా బుధవారం జరిగిన సమావేశంలో ఈ వైద్యనిపుణులు మాట్లాడుతూ రక్త నష్టం లేకుండా ఈ రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు జరిపినట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ చైన్నె రీజిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఇలన్ కుమరన్ కళియమూర్తి మాట్లాడుతూ తమ ఆసుపత్రులలో రోబో సాంకేతిక పరిజ్ఞానానికి సంబందించి సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉండటం వల్లే 150 రోజుల్లో 150 రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు జరుపగలిగామని తెలిపారు. ఈ రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నవారు 4 రోజుల లోపున కోలుకుంటారని పేర్కొన్నారు.