
క్లుప్తంగా
చేతుల్లోంచి పడి చిన్నారి మృతి
అన్నానగర్: నైల్లె సమీపంలో తల్లి చేతుల్లోంచి పడి 4 నెలల చిన్నారి మృతిచెందింది. నైల్లె జిల్లాలోని ముక్కుడల్ సమీపం సింగంపారై బెసండియార్ వీధికి చెందిన తిలగర్‌ఆంథోనీరాజ్ (27), సజిత (24) దంపతులు. వీరికి ఒక కుమారుడు, 4 నెలల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో బుధవారం సజిత తన కూతురిని చేతిలో పట్టుకుని ఇంటివద్ద నిలబడి ఉంది. ఆ సమయంలో ఆమె చేతుల్లో ఉన్న చిన్నారి అదుపుతప్పి కింద పడింది. ఈఘటనలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలై ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
హత్యాయత్నం కేసులో
రౌడీకి ఏడేళ్ల జైలు
తిరువొత్తియూరు: హత్యాయత్నం కేసులో ఓ రౌడీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పూందమల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. చైన్నె పోరూరు సమీపంలోని కరంబాక్కం ప్రాంతానికి చెందిన షణ్ముగసుందరం (50), అదే ప్రాంతానికి చెందిన రౌడీ అశ్వంత్ (30) కు మధ్య గతంలో గొడవలు ఉండేవి. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 31న షణ్ముగసుందరంను కరత్రో కొట్టి హత్య చేయడానికి అశ్వంత్ యత్నించాడు. ఈ ఘటనలో గాయపడిన షణ్ముగసుందరం వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేసి అశ్వంత్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసు విచారణ పూందమల్లి క్రిమినల్ కోర్టులో జరిగింది. కేసు విచారణ ముగియడంతో మంగళవారం న్యాయమూర్తి సుందరరాజన్ తీర్పు ఇచ్చారు. తీర్పులో రౌడీ అశ్వంత్‌కు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 30,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ తరపున న్యాయవాది ఏంజెల్ స్టూబిల్లా వాదించారు.
అరణియార్ గేట్ల ట్రయల్ రన్
నాగలాపురం: అరణియార్ జలాశయ స్పిల్‌వే గేట్లు ట్రయల్‌రన్‌ను బుధవారం నిర్వహించారు. నీటి పారుదల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు, ఈఈ వెంకట శివారెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను డీఈ శ్రీనివాసులు, ఏఈ ధరణి కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో నీట మట్టం 26 అడుగులకు చేరువైంది. అలాగే ప్రస్తుత సీజన్‌లో పూర్తిస్థాయి నీటి మట్టానికి జలాశయం చేరుకునే అవకాశాలు మెండుగా ఉండడంతో గేట్ల పనితీరును వారు పరిశీలించారు. కొన్ని నిమిషాలు పాటు నాలుగు గేట్లను పైకెత్తి ట్రయల్‌రన్ చేశారు. వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గేట్లను మూసివేశారు. జలాశయ నీటి మట్టం 30 అడుగులకు చేరే సమయంలో కొద్ది కొద్దిగా నీటిని దిగువకు విడుదల చేసి నీటి మట్టం స్థిరంగా ఉండేలా పర్యవేక్షించాలని స్థానిక ఇంజినీర్లకు ఎస్‌ఈ ఆదేశించారు.
శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం మఠం పీఠాధిపతి
తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం ఉడిపిలోని కానీయూరు మఠం పీఠాధిపతి విద్య వల్లభ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

క్లుప్తంగా