
పాలారు తీరప్రాంత వాసులకు హెచ్చరికలు
వేలూరు: పాలారులోని అనకట్టు డ్యామ్ నుంచి నీరు అధికంగా వస్తున్న కారణంగా పాలారు పక్కన నివశిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. శనివారం ఉదయం పొన్నై సమీపంలోని అనకట్టు డ్యామ్‌ను ఆమె తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా కలవకుంట డ్యామ్ నుంచి అధికంగా నీరు బయటకు వస్తున్న కారణంగా ఆ నీరు పొన్నై సమీపంలోని అనకట్టు డ్యామ్‌కు చేరుతోందన్నారు. ప్రస్తుతం నీరు అధికంగా రావడంతో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం పాలారు నదిలో అధికంగా వర్షపు నీరు వస్తున్న కారణంగా నది ఒడ్డున ఉన్న వారు ఎవరూ పాలారుకు సమీపంలోని వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసి దండోరా వేశామన్నారు. కలవకుంటలోని జలాశయం నుంచి వచ్చే నీరు ఇప్పటికే 59 చెరువులు నిండి పాలారులో వస్తుందన్నారు. అనంతరం అధికారుల వద్ద నీటి మట్టం వివరాలు, ప్రస్తుతం ఎంత నీటిని విడుదల చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్ ఇంజినీర్‌లు, అధికారులు పాల్గొన్నారు.