
క్లుప్తంగా
నగరాలలో కార్తిక్ సంగీత వేడుక
సాక్షి, చైన్నె : ట్రైబ్ వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్ నేతృత్వంలో ప్రఖ్యాత గాయకుడు , స్వరక్త కార్తీక్ మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్‌కు సిద్ధమయ్యారు. చైన్నె, మదురై, కోయంబత్తూరులతో పాటుగా పలు నగరాలలో ప్రత్యక్ష ప్రసారంగా సంగీత వేడుకకు ఏర్పాట్లు చేపట్టారు. శనివారం ఈ వివరాలను ట్రైబ్ వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు షోవెన్ షా ప్రకటించారు. హిట్ పాటలను హృదయాన్ని తాకే విధంగా సంగీత ప్రదర్శన ఉంటుందని వివరించారు. బుక్ మై షో ద్వారా ఈ సంగీత వేడుక టికెట్లను పొందు పరిచామని పేర్కొన్నారు. నవంబర్ 30 నుంచి తిరుపతి, విశాఖ పట్నం, కోయంబత్తూరు, కొచ్చి, రాజమండ్రి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చైన్నె, మధురై , వరంగల్ వంటి నగరాలలో ఈ సంగీత ప్రదర్శనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాయకుడు కార్తీక్ బహుముఖ ప్రజ్ఞాశాలి ప్లే బ్యాక్ గాయకులతో ఒకరిగా ఎదిగారని, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం తదితర 15కుపైగా భాషలలో 8 వేలకు పైగా పాటలను పాడినట్టు తెలిపారు.
చైన్నెలో ఆంకాలజీ సదస్సు
సాక్షి, చైన్నె: జీఐ ఆంకాలజీ ఇన్నోవేషన్స్, ఏఐ అండ్ బియాండ్ అనే అంశంతో చైన్నెలో సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్య్రాస్ట్రో ఎంటరాలజీ 2025 సదస్సు ఆదివారం వరకు జరగనుంది. తొలి రోజున రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్, ఎంజీఆర్ వైద్య వర్సిటీ చాన్స్‌లర్ కె. నారాయణ స్వామి, మెడికల్ డైరెక్టర్ ఆర్. సుగంది రాజకుమారి, అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డి. ముత్తు పాండియన్, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జిశ్వంత్ హాజరై జీర్ణాశయాంతరం ఆంకాలజీ, మినిమల్లీ ఇన్వాసివ్‌సర్జరీలో పురోగతి ,రొబోటిక్ సర్జరీ, ఏఐ ఆధారిత సర్జరీలగురించి రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఉపన్యాసాలు, చర్చలు, ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, అంతర్జాతీయ నిపుణులను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
సేవా ప్రమాణాల
పెంపునకు విస్తృత చర్యలు
సాక్షి, చైన్నె: డిజిటల్ సామర్థ్యాలు, వినియోగ దారుల సేవా ప్రమాణాల పెంపునకు విస్తృతంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని ఎస్‌యూడీ లైఫ్ ప్రధాన పెట్టుబడి అధికారి ప్రశాంత్ శర్మ తెలిపారు. ఎస్‌యూడీ లైఫ్, ఎస్‌యూడీ లైఫ్ నిఫ్టీ ఆల్పా 50 ఇండెక్స్ ఫండ్‌ను స్థానికంగా ప్రారంభించిన ఆయన సమగ్ర వివరాలను తెలియజేశారు. ఈ ఇండెక్స్ టాప్ 50 స్టాక్‌లను కలిగి ఉంటుందని, వీటి ఆధారంగా సామర్థ్యాన్ని అంచనా వేయడం జరుగుతందని వివరించారు. ఈ నిధి ఆవిష్కరణ పెట్టుబడి దారులకు మరింత ఆలోనాత్మకమైన మార్గాన్ని అందిస్తుందన్నారు. పెట్టుబడి పెట్టడం, డేటా నిర్వహణలో యూఎల్‌ఐపీ చార్జీల నుంచి సున్నా శాతం జీఎస్టీ అదనపు ప్రయోజనం దక్కుతుందన్నారు. ఈ కొత్త ఫండ్‌ఆఫర్ అన్నది అక్టోబరు 24వ తేది వరకు ఉంటుందన్నారు. కాగా, తాము 20 వేల కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ టచ్ పాయింట్ల నెట్ వర్క్‌తో 2025 మార్చి 31 నాటికి రూ. 31,069 కోట్లు సాధించినట్టు, డిజిటల్ సామర్థ్యాలు, సేవా ప్రమాణాలను మరింత విస్తృతం చేయడంలో ముందంజలో దూసుకెళ్తున్నామన్నారు.
పురసైవాక్కం మురుగునీటి
పంపింగ్ స్టేషన్‌కు మరమ్మతులు
తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కంలో అక్టోబర్ 14 మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 15 రాత్రి వరకు మురుగునీటి పంపింగ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా పనిచేయదని అధికారులు శనివారం ప్రకటించారు. వివరాలు..చైన్నె కార్పొరేషన్ ద్వారా గణేశపురం, వ్యాసర్పడి, జీవా రైల్వే స్టేషన్ అండర్‌పాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, డాక్టర్ అంబేద్కర్ కళాశాల రోడ్డులో ఉన్న 1,050 మిల్లీమీటర్ల వ్యాసం గల మురుగునీటి పైపు మార్చనున్నారు. దీని కారణంగా, అక్టోబర్ 14 మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్టోబర్ 15 రాత్రి 8 గంటల వరకు పురసైవాక్కం మురుగునీటి పంపింగ్ స్టేషన్ నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. దీంతో రాయపురం, తిరు.వి.క. నగర్, అన్నా నగర్, తేనాంపేట వంటి మండలాల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మురుగునీటికి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఆయా ప్రాంతాల ఇంజినీర్లను, సహాయ ఇంజినీర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఈ ప్రకటనలో వెల్లడించారు.
బైక్ ఢీకొని మహిళా పోలీస్ మృతి
తిరువొత్తియూరు: కృష్ణగిరి సమీపంలో శనివారం ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా పోలీసు మృతి చెందారు. కృష్ణగిరి జిల్లా సమీపం సందూర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు. అతని భార్య రమామణి ( 36) మత్తూరు స్టేషన్‌లో పోలీస్‌గా పని చేస్తున్నారు. శనివారం ఉదయం ఆమె ఉతంగరై డీఎస్పీ కార్యాలయంలో జరిగిన కవాతులో పాల్గొని, ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్‌కు తిరిగి వెళుతుండగా ఆ సమయంలో మాథుర్ – తిరువణ్ణామలై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో ఓ బైక్ రమామణిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను అటుగా వెళ్తున్నవారు రక్షించి కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళుతుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.