
వాడీవేడిగా గ్రామసభలు
– మౌలిక సదుపాయాలను కల్పించాలని వినతి
తిరువళ్లూరు: జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామసభలో మౌలిక సదుపాయాల కల్పించాలని కోరుతూ స్తానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్టోబర్ రెండున గాంధీజయంతిని పురస్కరించుకుని గ్రామసభలను నిర్వహించాల్సి వున్న క్రమంలో అదే రోజు సరస్వతి పూజ సెలవు దినం కావడంతో గ్రామసభలను 11వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న 526 గ్రామపంచాయతీల్లో సభలు జరిగాయి. సభకు పంచాయతీ అద్యక్షుడు లేకపోవడంతో గ్రామ కార్యదర్శి అధ్యక్షత వహించారు. గ్రామసభ పర్యవేక్షకులుగా డిప్యూటీ బీడీఓలు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. కాగా పూందమల్లి యూనియన్ నసరత్‌పేటలో జరిగిన గ్రామసభకు మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మేల్యే కృష్ణస్వామి తదితరుల పాల్గోని గ్రామంలోని సమస్యలపై చర్చించారు. గ్రామస్తులు స్థానిక సమస్యలను మంత్రి నాజర్ దృష్టికి తీసుకుని రాగా, ఆయన తక్షణం పరిస్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా పుట్లూరులో జరిగిన గ్రామసభలో తోపులాట , అరుపులు, కేకలు, వాగ్వాదంతో ముగిసింది. పుట్లూరు గ్రామ కార్యదర్శి గోపీనాథ్ సమస్యలను పరిష్కరించడం లేదని, రోడ్లు, వీధిధీపాల ఏర్పాటు, తాగునీటి సమస్యకు పరిష్కారం తదితర వాటిపై పలుమార్లు వినతి పత్రం సమర్పించినా స్పందించడం లేదని వాపోయారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అరణ్‌వాయల్‌లో జరిగిన గ్రామసభలో కులాల పేర్లుతో ఉన్న వీధులు, రోడ్లు పేర్లు మార్చాలని తీర్మానం చేశారు. కాగా అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామసభల్లో పాల్గొన్న దృశ్యాలను గ్రామస్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.