
ఘనంగా శనివారాల పండుగ
వేలూరు: తమిళ పురటాసి మాసం నాలుగో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు. నాలుగో శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఉపవాసంతో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడింది. వేలూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార మందిరంలో ఉదయం 5 గంటలకే స్వామివారికి విశేష పూజలు చేసి, వివిధ పుష్పాలతో అలంకరించారు. అదేవిధంగా ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులుతీరారు. అదే విధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం, అరసంబట్టు పెరుమాళ్ ఆలయం, బ్రహ్మపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. అదే విధంగా వాలాజలోని శ్రీధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాళ్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ చేశారు. వేలూరు జిల్లాతోపాటు తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడింది. ఇదిలా ఉండగా వేలూరు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రం నుంచి వేలూరు నాయుడు సంఘం జిల్లా అధ్యక్షుడు సెవన్‌జీ మురళీధరనాయుడు ఆధ్వర్యంలో దేవస్థాన సమాచార కేంద్రం వద్ద అన్నదానం చేశారు. అనంతరం మొత్తం వంద మంది భక్తులను రెండు బస్సుల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు టీటీడీ సమాచార కేంద్రంలో భక్తులకు అన్నదానం చేశారు.