
రూ.1.26 లక్షలు పలికిన శ్రీవారి లడ్డు
కొరుక్కుపేట: చైన్నె షావుకారుపేట చిన్నతంబి మొదలి వీధిలో వేంకటేశ్వర తిరుమల పవిత్ర గొడుగుల 17 వ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీవారికి విశేష పూజలు, అన్నదానాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పి.వెంకటరత్నం, పి.అశోక్ కుమార్, సి.హెచ్ .సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ మధు, వి.శ్రీనివాసులు, ఏబీ గుణ, అనిశెట్టి గున్నయ్య, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేదికపై కొలువు దీర్చి పుష్పాలు, సుగంధద్రవ్యాల మాలతో అలంకరించి హారతి పూజలు నిర్వ హించారు. పూజారి జోలా ప్రసాదశర్మ నేతత్వంలో జరిగిన పూజల్లో శ్రీవారికి ప్రత్యేకంగా తయారుచేసి నివేదించిన లడ్డూ ప్రసాదాన్ని జె.శ్రీనివాసులు కంపెనీ అధినేత శ్రీనాథ్ రూ. 1.26 లక్షలకు దక్కించుకున్నారు. వరుసగా మూడోసారి శ్రీవారి లడ్డును శ్రీనాథ్ కై వసం చేసుకోవడం విశేషం. అనంతరం 2 వేల మందికి పైగా భక్తులకు, ప్రజలకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
పురటాసి శనివారం ఉత్సవాలు
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు, కాలడిపేట వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఏలకులు, లవంగాల మాలలతో పగడపు వర్ణం పెరుమాళ్ ఉత్సవమూర్తి దర్శనమిచ్చారు. తిరువొత్తియూరు కాలడిపేట కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నాలుగో పురటాసి శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామి దర్శనం చేసుకున్నారు. చిన్న కాంచీపురం అని పిలువబడే 400 సంవత్సరాల పురాతనమైన ఆంగ్లేయులు నిర్మించిన కాలడిపేట శ్రీకల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో పురటాసి మాసంలో శనివారాలలో పెరుమాళ్ ఊరేగడం ఆనవాయితీ. ప్రతి వారం విశేష అలంకరణలతో పెరుమాళ్ ఊరేగుతారు. ప్రతి వారం భారీ పూలమాలలతో అలంకరించి, ప్రజలకు దర్శనమిస్తారు. శనివారం 40 కిలోల బరువు, అత్యున్నత నాణ్యత గల ఏలకులు, లవంగాలతో తయారు చేసిన భారీ మాలలతో శ్రీదేవి భూదేవి సమేత పగడపు వర్ణం పెరుమాళ్ ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి శ్రీపెరుంతేవి తల్లికి ఏలకుల వస్త్రం అలంకరించి దర్శనమిచ్చారు. ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకునే విధంగా నాలుగు వారాలుగా వివిధ రకాలుగా పెరుమాళ్ సన్నిధిలో రంగుల ముగ్గులు వేస్తున్నారు. నాలుగో వారం కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు స్వామి దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వచ్చారు.
శివకాశిలో పేలుడు
సాక్షి, చైన్నె: శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో పేలుడు చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డట్టు సమాచారం. జ్ఞానవేల్‌కు చెందిన పరిశ్రమలో సాయంత్రం ఈ పేలుడు జరిగింది. ఓగదిలోని బాణసంచాలు పూర్తిగా దగ్గమయ్యాయి. ఈ గది, పరిసరాలలోని ఇతర గదులలో పలువురు కార్మికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ గదిలో ఉన్న వారు ఆరుగురు గాయాలతో బయటపడినట్టు, వారంతా ఆస్పత్రిలో చికిత్సలో పొందుతున్నట్లు తెలుస్తోంది. బాణసంచా అర్ధగంటకు పైగా పేలుతూనే ఉండడంతో ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండాయి. అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమించాల్సి వచ్చింది. ఇతర వివరాలను తెలియాల్సి ఉంది.