
బహిరంగ ప్రదేశాల్లో జెండాలు వద్దు
తిరుత్తణి: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా రాజకీయ పార్టీలు జెండాలు ఏర్పాటు చేయరాదని ఆర్డీఓ సూచించారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆర్డీఓ కనిమొళి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే. కాంగ్రెస్, బీజేపీ, వీసీకే, టీవీకే, డీఎండీకే , పీఎంకే సహా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలు, సమావేశాలు సందర్భంగా రహదారుల మధ్యలో డివైడర్లు, రోడ్డుకు ఇరువైపుల జెండాల ఏర్పాటుతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైకోర్టు సూచన మేరకు బహిరంగ ప్రదేశాల్లో జెండాలు నాటడం, ఆవిష్కరిండం నేరమని ప్రతి రాజకీయ పార్టీలకు చెందిన వారు బహిరంగ ప్రదేశాల్లో జెండాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రయివేటు స్థలాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకుని జెండాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.