
కోర్టుకు విజయ్
– అనుమతుల కోసం వినతి
సాక్షి, చైన్నె : తన ఎన్నికల ప్రచారానికి అనుమతి కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌కు ఏర్పడింది. బుధవారం ఆయన తరపున పార్టీ నేత నిర్మల్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ తన ఎన్నికల ప్రచార సభల కార్యక్రమానికి శనివారం (13వ తేది) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరుచ్చిలో ఆయన ప్రచార కార్యక్రమానికి ఎవ్వరూ ఊహించని రీతిలో జన సందోహం పోటెత్తారు. ఇదేపరిస్థితి అరియలూరు, పెరంబలూరులలోనూ చోటు చేసుకుంది. అయితే, తిరుచ్చిలో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో తాము అనుమతుల కోసం ముందుగా ఆశ్రయిస్తే పోలీసులు పలు రకాల ఆంక్షలను విధిస్తూ రావడాన్ని తమిళగ వెట్రి కళగం వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. డిసెంబరు 20వ తేదీ వరకు ప్రతి శనివారం విజయ్ పర్యటనలు సాగనున్నాయి. ఈ దృష్ట్యా, అనుమతులు కల్పించాలని విన్నవిస్తూ పలు జిల్లాలో పోలీసులను పార్టీ వర్గాలు ఆశ్రయించారు. అయితే, అనేక చోట్ల అనుమతులు మంజూరు కాలేదు. అదే సమయంలో అనేక ఆంక్షలు, కఠిన నిబంధనలు విధిస్తూ వస్తున్నారు. ఈపరిణామాలతో అనుమతుల కోసం ఇక గత్యంతరం లేని పరిస్థితులలో విజయ్ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమపై ఎలాంటి వివక్ష అన్నది చూపించకుండా ప్రచార కార్యక్రమాలకు అనుమతులను పోలీసులు మంజూరు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, విజయ్ ప్రచార కార్యక్రమాలకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజయ్ తరపున పార్టీ నేత నిర్మల్‌కుమార్ ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.ఇది ఒకటి రెండు రోజులలో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.