
12 జిల్లాలల్లో భారీ వర్షాల అలర్ట్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో 12 జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నె నగరంలో కొన్ని చోట్ల, శివారులలో అనేక చోట్ల కుండ పోతగా వర్షం సోమవారం రాత్రంతా కురిసింది. ఈ కారణంగా 14 విమాన సేవలకు ఆటంకం నెలకొంది. గత కొద్ది రోజులుగా రాత్రులలో చైన్నె శివారులలో వర్షం పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. వర్షాల నేపథ్యంలో చైన్నె కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. అదేసమయంలో విద్యుత్ బోర్డు అధికారులు సైతం రంగంలోకి దిగారు. వరద ముంపు ఎదురయ్యే ప్రాంతాలలో రోడ్డుపై ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల పరిరక్షణపై చర్యలు చేపట్టారు. వర్షాల సీజన్ నేపథ్యంలో సిబ్బంది అంతా విధులలో ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిస్థితులలో సోమవారం రాత్రంతా చైన్నె నగరంలో కొన్ని చోట్ల, శివారులలో పలు చోట్ల భారీ వర్షం పడింది. కోడంబాక్కం, అశోక్ నగర్ , పెరంబూరు పరిసరాలలో భారీగానే వర్షం పడింది. కోడంబాక్కంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నీళ్లు చేరడంతో ఉదయాన్నే విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. అశోక్ నగర్‌లో ఈదురు గాలుల దాటికి మూడు చెట్లు నేల కొరగగా, అధికారులు యుద్ద ప్రాతిపదికన తొలగించారు. సైదా పేటలో అత్యధికంగా 12 సె.మీ వర్షం పడగా, మైలాపూర్ పరిసరాలలో 8 సెం.మీ వర్షం పడింది. వర్షం కారణంగా సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం రకు 14 విమానాల సేవలకు ఆటంకం నెలకొన్నాయి. ఖాతర్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. కొన్ని గంటల అనంతరం విమాన సేవలు యధా ప్రకారం జరిగాయి. ఇక, బుధ, గురువారాలలో కాంచీపురం, చెంగల్పట్టు,తిరువణ్ణామలై, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, తంజావూరు, తిరువారూర్, శివగంగై, మదురై, తేని, దిండుగల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నీలగిరులలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఇక్కడి వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక, సేలం మేట్టూరు జలాశయానికి కావేరి నదిలో 14 వేలు క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. డ్యాం నీటి మట్టం 119.50 అడుగులుగా కొనసాగుతుండటంతో కెనాల్స్ ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కోడంబాక్కం స్కూల్ ఆవరణలో విద్యార్థుల అవస్థలు

12 జిల్లాలల్లో భారీ వర్షాల అలర్ట్