
నాగర్‌కోయిల్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు
కొరుక్కుపేట: నిషేధిత సంస్థకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కొంతమందిని అరెస్టు చేశారు. విచారణలో కన్యా కుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ వాటావిలై ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా అరెస్టు చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. దీంతో ఎన్‌ఐఏ అధికారులు సంబంధిత యువకుడిని విచారించాలని నిర్ణయించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, చైన్నె నుంచి ఆరుగురు ఎన్‌ఐఏ అధికారుల బృందం మంగళవారం కన్యాకుమారికి చేరుకుని, అనుమానిత వ్యక్తి ఇంటికి వెళ్లారు. కానీ ఆ యువకుడు ఇంట్లో లేడు. ఇంట్లో అతని తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. ఈ ఘటన గురించి అధికారులు తల్లిదండ్రులను ప్రశ్నించారు. తల్లిదండ్రులు తమ కుమారుడు పని కోసం చైన్నె వెళ్లాడని చెప్పారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎన్‌ఐఏ అధికారుల విచారణను ఉదయం 9 గంటల వరకు కొనసాగింది. ఆ సమయంలో, యువకుడుతో మాట్లాడారు. తర్వాత, అధికారులు ఆ యువకుడిని విశాఖపట్నం ఎన్‌ఈ ఐ ఏ కార్యాలయానికి విచారణ కోసం రావాలని చెప్పి వెళ్లిపోయిన్లు సమాచారం.
నటి ఎంఎన్ రాజ్యంకు లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు
తమిళసినిమా: సుప్రసిద్ధ నటీమణి ఎంఎన్ రాజ్యంను లైఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నట్లు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ప్రతినిథులు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఈ నెల 21వ తేదీన స్థానిక తేనాంపేటలోని కామరాజ్ ఆవరణలో సర్వ సభ్య సమావేశం, కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణి ఎంఎన్ రాజ్యంను జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించనున్నట్లు తెలిపారు.1950–60 ప్రాంతంలో ప్రముఖ నటిగా రాణించిన ఎంఎన్ రాజ్యం ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన నాడోడి మన్నన్‌తో పాటూ రక్తకన్నీర్, పెన్నిన్ పెరమై, పుదయల్, తంగపదుమై, పాశమలర్, ఆలిబాబావుమ్ 40 తిరుడర్ గళ్ మొదలగు 200 చిత్రాలకు పైగా నటించారు. ఈమె ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే నటించారు. కాగా దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కోశాధికారి కార్తీక్, ఉపాధ్యక్షుడు పూచీ ఎస్.మురుగన్ మంగళవారం ఎంఎన్ రాజ్యంను కలిసి జీవిత సాఫల్యం సత్కారం గురించి చెప్పి, ఆమె సమ్మతం పొందారు. కాగా ఎంఎన్.రాజ్యం ఇటీవలే 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం.
విజయ్ పర్యటనల్లో మార్పు
సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తన మీట్ ది పీపుల్ పర్యటనలలో స్వల్ప మార్పులకు ఆదేశించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. శనివారం తిరుచ్చి వేదికగా ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. ఒకేరోజున మూడు జిల్లాల పర్యటనకు ఆయన వెళ్లారు. అయితే పెరంబలూరులో పర్యటించలేని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిన జనం నిరాశతో వెనుదిరిగారు. ఈనేపథ్యంలో ఇకపై తన పర్యటనలో రెండు జిల్లాలను మాత్రమే ఆయన ఎంపిక చేసుకునేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఉదయం ఓ జిల్లా ,సాయంత్రం మరో జిల్లాలో పర్యటించేందుకు నిర్ణయించి, అందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌లో మార్పునకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ద్రవిడ పార్టీల ఆవిర్భావకర్త దివంగత అన్నాదురై తన రాజకీయ వారసుడిగా విజయ్‌ను ప్రకటించే రీతిలో ఏఐ టెక్నాలజీతో అభిమానులు రూపొందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో తాజాగా వైరల్ అయింది.
తమిళనాడుకు అదనంగా 350 ఎంబీపీఎస్ సీట్లు
కొరుక్కుపేట: భారతదేశం అంతటా 2024–25 సంవత్సరంలో 1,17,750గా ఉన్న ఎం.బి.బి.ఎస్ సీట్ల సంఖ్యను 2025–26 సంవత్సరంలో 1,23,100కు పెంచారు. దీంతో తమిళనాడులోని స్వయం–ఆర్థిక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో 2వ దశ కౌన్సెలింగ్ కోసం కళాశాలలకు ప్రభుత్వం ప్రస్తుతం 350 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా కేటాయించింది. ఏయే కళాశాలల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు 19న ప్రకటించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వైద్యవిద్యా విభాగం అధికారులు మంగళవారం వెల్లడించారు.