
నిషేధిత గుట్కా స్వాఽధీనం
– ఒకరి అరెస్టు
తిరువళ్లూరు: కారులో నిషేధిత గుట్కాను తరలిస్తూ పోలీసులను చూడగానే కారును రోడ్డులో ఆపి వరి పొలంలో దాక్కుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు, కారును సీజ్ చేసి 350 కిలోల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గుట్కా, గంజాయి, కల్తీమద్యం, మత్తుమాత్రల అక్రమ రవాణా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం అనుమానాస్పదంగా వచ్చిన కారును ఊత్తుకోట చెక్‌పోస్టు వద్ద ఆపడానికి పోలీసులు యత్నించారు. అయితే ఆక్కడ కారును ఆపకుండా వేగంగా ఇద్దరు యువకులు ముందుకు సాగించారు. అనంతరం పెనాలూరుపేట పోలీసులు సైతం కారు ఆపే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. దీంతో పోలీసులు వైర్‌లెస్ ద్వారా పుల్లరంబాక్కం, తిరువళ్లూరు టౌన్, తాలుకా పోలీసులు, మనవాలనగర్ స్టేషన్‌లకు సమాచారం ఇచ్చారు. పుల్లంరంబాక్కం వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు కారును రివర్స్ చేసి పరార్ కావడానికి యత్నించారు. అయితే పోలీసులు వారిని వెంబడించడంతో పూండి వద్ద కారును ఆపి ఒకరు పూండి రిజర్వాయర్‌లోని ముళ్లపొదలు వైపు, మరొకరు వరి పొలాల్లో దాక్కున్నాడు. వరి పంటల్లో దాక్కుకున్న వ్యక్తిని గంట పాటు గాలించిన పోలీసులు, రాజస్థాఽన్‌కు చెందిన జగధీష్‌చౌదరి(26) అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. కారును సీజ్ చేసిన పోలీసులు అందులో అక్రమంగా తరలిస్తున్న నిషేదిత గుట్కా 350 కిలోలను స్వాధీనం చేసుకున్నారు.